‘కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం’ అంతేగా! ఇందులో జనన మరణాల మధ్యలో నిగూఢంగా ఒక వెలుతురు, ఒక సత్యమూ దాగాయి. అవి జీవానికి సంకేతాలు. అవి మనలోనే ఉన్నాయి అనేది మరో కోణంలోని వేదాంతం కావొచ్చు. ఈ నేపథ్యంలో ఈ సత్యానికి, జీవానికి, వెలుతురుకూ అంటే వీటన్నిటికీ మూలం తానే అంటాడు క్రీస్తు! ఇటువంటి సంచలనమైన వాక్కులు క్రీస్తు నోట అగ్ని కణాల్లా అప్పుడప్పుడూ రగిలేవి. తూటాల్లా పేలేవి. ఆయన, ఈ భూతలంపై ఎంతటి శీతలమో, అంతటి అగ్ని గళం. ఆయన ఇక్కడికి వచ్చింది రాజీ మార్గానికి కాదు, భగభగ మంటలు రేపడానికే అనే విషయం చాలా సందర్భాల్లో సూచించాడు. ‘నేనే పునరుత్థానమును, జీవమును.
నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును’ (యోహాను సువార్త 11 : 25) అని పేర్కొన్నాడు. ఓ మనిషికి మరణం తుది శ్వాస. అదే చివరి యాత్ర. అలాంటప్పుడు, ఒక వ్యక్తి, మరణించినప్పటికీ ఎలా జీవిస్తాడు? కీర్తిశేషులంతా వారి వారి సత్క్రియల కారణంగా చిరస్మరణీయులైతే కావొచ్చు గానీ, చిరంజీవులు కాలేరు. కానీ, మంచి పనులు చేసిన వ్యక్తిని లోకం ఆ రీతిగా మహోన్నతంగా గౌరవించి వారిని చిరంజీవులు అంటున్నది. ఇక్కడ క్రీస్తు చెప్పిన మాట వెలుగు బాట. చీకట్లను తొలగించి, మహా జీవం నింపి సత్యోన్ముఖమైన మార్గంలోకి నడిపించే మాట. అయితే, ఆయనపై గాఢమైన విశ్వాసంతో ఉండాలి. ఆయన చెప్పిన మాటలపై నమ్మకం పెట్టుకోవాలి. అప్పుడే వారికి మరణం ఉండదని అంటాడు క్రీస్తు.