ప్రజలు దారి తప్పే సమయంలో కొన్ని హెచ్చరికలు చేస్తూ, రానున్న విపత్తులను ముందుగా సూచిస్తూ (ప్రవచిస్తూ) ప్రజల్ని సన్మార్గంలో నడిపించేవారు ప్రవక్తలు. ఈ ప్రవక్తలు చిన్న ప్రవక్తలని, పెద్ద ప్రవక్తలని ప్రాధాన్య సంఘటనల్ని బట్టి బైబిల్లో రెండు రకాలుగా కనిపిస్తారు. వారిలో హనోక్ ఒకరు. బైబిల్లో విశ్వాసానికి మారుపేరుగా అబ్రహామును చెప్పుకొంటారు. అంతకన్నా ఎక్కువగా హనోక్ విశ్వాసం కనిపిస్తుంది. భూమిపై దేవుడికి వ్యతిరేకంగా పాపపు చేష్టలు విజృంభించిన తరుణంలో ఏ జంకూ గొంకూ లేకుండా దేవుని కోసం ఎంతో నమ్మకంతో ఎదురుచూస్తూ తరించిన వ్యక్తి హనోక్.
భక్తులు చాలామంది దేవునికి దూరంగా ఉండి తమ భక్తిని ప్రకటించిన వారే. కానీ, హనోక్ ప్రభువుతో నడయాడి ముచ్చటించాడు. అదీ ఈయన ప్రత్యేకత! తన జీవితాన్ని దేవుడికి ధారపోసి, దేవుడితోపాటు నడిచి మోక్షానికి చేరుకున్న హనోక్.. విశ్వాసానికి ప్రతీకగా దర్శనమిస్తాడు.