‘మీరు వెలిగే దీపంలా పదిమందికీ ఆదర్శంగా ఉండాలి. మాటల కన్నా మీ చేతలే ముందు నడవాలి’ అనేది ప్రభు సందేశం. అందుకు ఆయన జీవితమే తార్కాణం. పదిమందికీ ఆదర్శవంతంగా నడుచుకునే వారి దగ్గర్నుంచి మళ్లీ ప్రత్యేకించి నీతిబోధల్ని ఆశించరు. ఆతని ప్రవర్తనే ఒక నీతి సూత్రాల గ్రంథం. ప్రభువు ఏం చేసేవాడో, అదే చెప్పేవాడు. మాట కంటే ఆయన మంచి బాటే ముందు నడిచేది. మనిషి చేయగలిగిందే ప్రభువు చెప్పాడు. ఏనాడూ అసాధ్యాలను చెప్పలేదు. అలా, ఆయన ఆదర్శవంతమైన నడవడికీ, పలికిన నానుడికీ కించిత్ భేదం లేదు. చాలామంది ఎదుటివారిని హేళన చేయడానికే వారి శక్తియుక్తులన్నీ వినియోగిస్తారు.
ముందుగా మనల్ని మనం సరిదిద్దుకుంటే, ఎదుటివారి జోలికి పొమ్మన్నా.. పోము. మనలో కుప్పలుగా తప్పులు ఉంచుకొని పక్కవారి చెడు గురించి ఎలా మాట్లాడగలం? అందుకే ప్రభువు ‘మీరు వేషధారుల్లా ఉండొద్ద’ని హెచ్చరిస్తాడు. ‘నీ కంటిలో ఒక దూలాన్నే పెట్టుకొని, ఎదుటివాని కంటిలోని నలుసు గురించి తెలుసు కోవాలనుకోడం మూర్ఖత్వం’ అని హితవు చెబుతాడు. ఒకరి గురించి తూకం వేసి విమర్శ చేసి తీర్పు చెప్పడానికి అర్హత కలిగేది మన మంచి ప్రవర్తన నుంచే సుమా! అందుకే పదిమందీ నిన్ను చూసి నేర్చుకునేలా నడవడిక ఉండాలని ప్రబోధిస్తాడు ప్రభువు.