అన్ని బంధాల నుంచి విడుదల కావడమే, మోక్షం. అందులోకి ఎవరు పడితే వారు తేలిగ్గా ప్రవేశించలేరు. ఎందుకంటే, కొందరు తమ బంధాల్ని, అనుబంధాల్ని తెంచుకోలేరు. వారికి ఆ మోక్ష ద్వారం తలుపులు తెరుచుకోవు. ఏన్నెన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని పూజలు చేసినా లభించని మోక్షం నిరాడంబరత, వినయం, అణకువ, దానం అనే గుణాలు ఉన్నవారు తేలిగ్గా మోక్ష ప్రవేశం చేయగలరని ప్రభువు పేర్కొన్నాడు. భౌతిక సంపన్నులు కాస్త తగ్గి తలదించక పోతే, వారికి మోక్ష ప్రాప్తి దొరకడం దుర్లభమని తెలిపాడు. ‘ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కన్నా.. సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాననెను’ (మత్తయి సువార్త 19:24). సూదిబెజ్జం చిన్నది.
స్థూలాకారంతో ఉండేది ఒంటె. భారీ శరీరం, పొడవాటి మెడ ఒంటెకున్న స్వరూప సంపద. అటువంటి భారీ ఒంటె కూడా చిన్న సూది బెజ్జంలోకి ప్రవేశించడం సులభం కానీ, ధనవంతుడు పరలోకంలోకి ప్రవేశించడం చాలా కష్టం అని ప్రభువు మాట. మరి ఆ ధనవంతుడికి మోక్ష ద్వారాలు తెరుచుకోవడం ఎలా? తన ధనాన్ని మొత్తం బీదలకు పంచి, ప్రభువాక్యం ప్రకారం నడుచుకున్నప్పుడు మాత్రమే పరలోకంలో కాస్తంత స్థానం లభిస్తుందని ప్రభువు పేర్కొన్నాడు. ధనవంతుడిగా పుట్టడం, ధనాన్ని ఆర్జించడం నేరం కాదు. కానీ, అది అవసరానుగుణంగా ఉండాలని క్రీస్తు సూచించాడు. ఉన్న సంపదను అవసరార్థులకు సద్వినియోగం చేస్తే మోక్షార్హత వస్తుందని సెలవిచ్చాడు.