క్రైస్తవ తత్వం ప్రకారం తండ్రి దేవుడు ఈ లోకానికి సృష్టికర్త. ఓ తనయునిగా వచ్చినవాడు క్రీస్తు. దుష్ట పూరితం అవుతున్న ఆ సృష్టి వినాశనాన్ని రక్షించడానికే ఆయన వచ్చాడని నమ్మకం. క్రీస్తు మోక్షారోహితుడైన తర్వాత.. ‘ఈ లోకాన్ని నడిపించే శక్తి ఎవరూ?’ అని ప్రశ్న వచ్చినపుడు, ఆ ఇద్దరితోనూ సరి సమానమైన ఆత్మే అని, అదే పవిత్రాత్మ శక్తి అని క్రైస్తవం నమ్ముతుంది. ఆత్మ పవిత్రాగ్ని రూపాన శిష్యులపైకి ఆవహిస్తుంది.
క్రీస్తు బోధించిన సత్యాల్ని లోకానికి అందించడానికి వస్తుంది. అందుకు తనకు వాహికలుగా బోధనా వాచికలుగా అపోస్తులుల రూపంలో ప్రభు వాక్యాన్ని పరివ్యాప్తి చేస్తున్నది. ప్రస్తుతం ఈ లోకాన్ని నడిపించేది పవిత్రాత్మే అని క్రైస్తవ సోదరుల విశ్వాసం. ఈ శక్తులు మువ్వురికీ (తండ్రి-తనయుడు- పరిశుద్ధాత్మ) భేదమన్నది లేదని సమ్యక్ సమైక్య త్రిత్వైక శక్తి అని నమ్ముతుంది. క్రీస్తు కూడా ‘నా బోధనల్ని నా సత్యాన్ని సంపూర్ణం చేసేది ఆత్మశక్తే! అదే మిమ్మల్ని నడిపించే శక్తి’ ప్రబోధించారు.