e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News ముచ్చటైన మూడు కోర్కెలు

ముచ్చటైన మూడు కోర్కెలు

‘నీ పాద కమల సేవయు
నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయును
తాపస మందార! నాకు దయసేయగదే!’
(భాగవతం)
ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు? అనేవి ఈ చిన్న పద్యం తెలియజేస్తుంది.

కంస వధకు ముందు బలరామకృష్ణులు మథురా నగరంలో ప్రవేశించారు. పురజనులు వారిని సందర్శించి మురిసిపోతున్నారు. బలరామకృష్ణులు ఆ దృశ్యాలను చూస్తూ రాజవీధిలో ముందుకు నడిచారు. తమను ధిక్కరించిన రజకుడిని భంగపరచి, అతని మూటలోని ధౌతవస్ర్తాలు తీసుకొని ధరించారు. దారిలో సుదాముడనే మాలికుని గృహానికి చేరుకున్నారు. వారిద్దరికీ సుదాముడు ప్రణమిల్లాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. తాంబూలకుసుమ గంధాదులు ఇచ్చి గౌరవించాడు. తన జన్మ ధన్యమైందన్నాడు. వారు కోరిన వరాలిస్తామన్నారు. అప్పుడు అతను పైపద్యంలో చెప్పిన విధంగా కోరుకున్నాడు. మాధవుడు అతనికి బలాయుఃకాంతి కీర్తి సంపదలు ప్రసాదించాడు.

- Advertisement -

ఇంతకీ పైపద్యంలో సుదాముడు ఏం కోరుకున్నాడు? అధికారం కోరలేదు. దానివల్ల అహంకారం పెరుగుతుంది కాబట్టి. అది రజోగుణ లక్షణం. అది చివరికి దుఃఖదాయకం అవుతుంది. ధనం కోరుకోలేదు. ‘ధనమెచ్చిన మదమెచ్చును’ అనేది ఉండనే ఉన్నది. ‘నీ పాద పద్మాల సేవను ప్రసాదించు’ అని కోరాడు. భగవంతుడు సేవ్యుడు (సేవించదగిన వాడు). భక్తుడు సేవకుడు- ఈ సేవ్యసేవక భావమే జారుపాటు లేనటువంటి సాధనామార్గం. కలియుగానికి ఎంతగానో తగినది. భగవానుడి పాదసేవ వల్ల అహంకారం పరిహారం అవుతుంది. అది సత్వ గుణ లక్షణం. కాబట్టి క్రమంగా దివ్యానంద ప్రదమైన భగవత్‌ సన్నిధానానికి దారితీస్తుంది.
రెండో మాటగా ‘నీ పాదార్చకుల తోడి నెయ్యము’ అని కూడా కోరుకున్నాడు. అంటే ‘నీ పాదాలను అర్చించేవారితో స్నేహం ప్రసాదించమ’ని అడిగాడు. భగవదర్చన వల్ల క్రమంగా అహంకారం మాయమవుతుంది. అహంకారం లేనివాడు అలాంటివారితోనే స్నేహం చేయాలి కానీ, అహంకారులతో కాదు. చేసినా అది కలకాలం నిలువదు. ఈ విషయాన్ని కూడా భాగవతంలో పోతన ప్రస్తావించాడు.
‘హరిగుణ మంగళ కీర్తన
పరుడై తగ నార్జవమున భగవత్‌ పరులం
గర మనురక్తి భజించుట
నిరహంకారమున నుంట
నిశ్చలుడగుటన్‌’

‘శ్రీహరిని కీర్తించడం, భగవద్భక్తులను సేవించడం, నిరహంకారంగా ఉండటం ముఖ్యం’ అని పద్య భావం.

మూడో అభ్యర్థనగా ‘నితాంతాపారభూతదయ’- ఎల్లప్పుడూ అపారమైన భూతదయ ఉండాలని కోరుకున్నాడు. ప్రాణులపట్ల దయ ఏ ఒక్కసందర్భంలోనో కాదు, ఎల్లప్పుడూ ఉండాలి. అలా ఉండకపోవడం వల్లే మనిషి జంతు హననానికి పాల్పడుతున్నాడు. అంతేకాదు సాటి మనుషులనూ చంపడానికి వెనుదీయడం లేదు.
‘ఒక కుక్క మరో కుక్కను చంపడం చూశారా! అవి ఒక్కోసారి ఘర్షణ పడే మాట వాస్తవమే కావచ్చు. అది కేవలం ఘర్షణ మాత్రమే! ఏ కాకి మరోకాకిని చంపదు. ఏ సింహమూ మరో సింహాన్ని చంపదు. జంతువులన్నిటిలో మనిషొక్కడే సాటి మనిషిని చంపుతాడు. తనవారినే చంపుకొనే జంతుతెగ మనిషిదే! మనిషి పశువుకన్నా అథమస్థాయికి పతనమయ్యాడు’ అంటారు ఓషో రజనీశ్‌.

ఆయన ఆవేదనకు కారణం మనిషిలోని నిర్దయే! నిరంతరం పాపభీతి లేకుండా జంతు హననానికి పాల్పడుతున్న మనిషిపై భగవంతుడికి కరుణా కటాక్షాలు ఎందుకు ఉంటాయి? లోకంలో మనుషులే బాధితుల పక్షం వహిస్తుంటే, దేవుడు మాత్రం వహించడా!
‘నీ పాదకమల..’ పద్యంలో సుదాముడు కోరుకున్న ముచ్చటైన మూడింటి కోసమే తపస్సు. అటువంటి తాపసులకు కల్పవృక్షం భగవంతుడు. అందుకే దేవుణ్ని ‘తాపస మందార!’ అని సంబోధించారు. ఆయన కృపావృష్టి మనపై సదా కురవాలని కోరుకుందాం!

డా॥ వెలుదండ సత్యనారాయణ
94411 62863

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement