Iron Deficiency | వయసుతో సంబంధం లేకుండా మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో ఐరన్ కూడా ఒకటి. శరీరంలో తక్కువగా ఉండే ఐరన్ స్థాయిలు హిమోగ్లోబిన్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది రక్తహీనతకు దారి తీయవచ్చు. శరీరంలో ఐరన్ తక్కువగా ఉండడం వల్ల రక్తహీనతతో పాటు మనం అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. కనుక మనం రోజూ తీసుకునే ఆహారంలో ఐరన్ ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. అయితే ఐరన్ ఉండే ఆహారాలను ఉడికించి తీసుకోవడమే కాకుండా వాటిని జ్యూస్ గా చేసి కూడా తీసుకోవచ్చు. అలాగే విటమిన్ సి ఉండే జ్యూస్ లను తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఐరన్ స్థాయిలను పెంచే విటమిన్ సి జ్యూస్ లను ఎలా తయారు చేసుకోవాలో పోషకాహార వైద్యులు వివరిస్తున్నారు.
ఐరన్ లోపాన్ని తగ్గించడంలో పాలకూర మనకు ఎంతో సహాయపడుతుంది. దీనిలో ఐరన్ తో పాటు విటమిన్ బి6, బి2, కె, ఇ, సి వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. కాలే ఆకులను జత చేయడం వల్ల ఈ జ్యూస్ కు మంచి రుచి వస్తుంది. ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన విటమిన్ సి తో పాటు ఐరన్ కూడా అందుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇక విటమిన్ సి అనగానే మనకు ముందుకు గుర్తుకు వచ్చేది నారింజ పండు. దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం తినే ఆహారాలలో ఉండే ఐరన్ ను మన శరీరం ఎక్కువగా గ్రహిస్తుంది. తద్వారా ఐరన్ లోపం తగ్గుతుంది. ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పైనాపిల్, నారింజ, ఆనపకాయను కలిపి జ్యూస్ గా చేసి తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ సి లోపం లేకుండా ఉంటుంది. శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఈ జ్యూస్ నేరుగా శరీరానికి ఐరన్ ను అందించకపోయినా ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ స్థాయిలు తగ్గకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. బీట్రూట్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ సితో పాటు ఐరన్ కూడా అందుతుంది. బీట్రూట్ జ్యూస్ ను నేరుగా చేసి తీసుకోవడంతో పాటు దీనిలో మిరియాలు, ఉప్పు, బెర్రీలు వంటి వాటిని కలిపి బీట్రూట్ షాట్స్ చేసి కూడా తీసుకోవచ్చు. ఈ జ్యూస్ చాలా రుచిగా ఉంటుంది. కనుక దీనిని పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. ఈ షాట్స్ ను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.
పుచ్చకాయను, దానిమ్మను మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం రాకుండా ఉంటుంది. పుచ్చకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. జార్ లో పుచ్చకాయ ముక్కలు, దానిమ్మ గింజలు, పుదీనా ఆకులు వేసి జ్యూస్ గా చేసుకోవాలి. తరువాత ఇందులో రుచికి తేనె, నిమ్మరసం, ఉప్పు వంటి వాటిని కలిపి తీసుకోవచ్చు. అరటిపండులో విటమిన్ సి తో పాటు ఐరన్ కూడా ఉంటుంది. దీనిని నేరుగా తినడం కంటే జ్యూస్ గా తీసుకోవడానికే చాలా మంది ఇష్టపడతారు. అరటిపండు, తేనె, గుమ్మడి గింజలు కలిపి స్మూతీలాగా చేసి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. శరీరంలో విటమిన్ సి, ఐరన్ లోపాలు రాకుండా ఉంటాయి.
స్ట్రాబెర్రీలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. స్ట్రాబెర్రీ, అరటిపండు స్మూతీ చేసి తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. జార్ లో కాచి చల్లార్చిన పాలు, అరటిపండు, తేనె, స్ట్రాబెర్రీలు వేసి స్మూతీ లాగాచేసుకోవాలి. తరువాత ఐస్ లేదా పుదీనా ఆకులతో గార్నిష్ చేసి తీసుకోవచ్చు. ఐరన్ లోపంతో బాధపడే వారు తరుచూ ఐరన్, విటమిస్ సి ఉండే ఆహారాలను ఉడికించి తీసుకోవడానికి బదులుగా ఇలా జ్యూస్ ల రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఐరన్ లోపంతో బాధపడే వారు ఇప్పుడు చెప్పిన జ్యూస్ లను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.