కురుక్షేత్ర సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. దుర్యోధనుడు సర్వ సైన్యాలతో సిద్ధంగా ఉన్నాడు. భీష్ముడు సర్వ సైన్యాధ్యక్షుడిగా కదిలాడు. ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ వంటి యోధానుయోధులు తన పక్షంలో ఉన్నారన్న ధీమా దుర్యోధనుడిది. కర్ణుడు తనకు సహజ కవచంగా ఉన్నాడనే ధైర్యం ఉంది. పాండవులపై తమ గెలుపు సునాయాసం అవుతుందని బలంగా విశ్వసించాడు సుయోధనుడు. పాండవుల పక్షంలోనూ ఉత్సాహం ఉరకలేయసాగింది. సైన్యం బలాబలాల కన్నా, ధర్మం తమ పక్షాన ఉందన్న ధీమాతో ఉన్నారు వారు. శ్రీకృష్ణుడు సారథిగా ఉండటంతో గెలుపు తమదే అని భావించారు.
ఇరుసేనలూ కురుక్షేత్రంలో ఎదురుపడ్డాయి. పాండవుల సైన్యాన్ని చూసి దుర్యో ధనుడిలో ఎలాంటి చలనం కలగలేదు. తన బలాన్ని చూసుకొని గర్వపడ్డాడు. కానీ, కౌరవ సేనలను శత్రువులుగా చూడలేకపోయాడు అర్జునుడు. విల్లు ఎక్కుపెట్టలేకపోయాడు. నారి సంధించలేకపోయాడు. మనసులో నుంచి దుఃఖం పొంగుకొచ్చింది. అయినవారిని చంపి పొందే రాజ్యం తనకు అక్కర్లేద ని భావించాడు. గతంలో తమకు జరిగిన అవమానాలన్నీ మరచిపోయాడు. అస్త్ర సన్యాసం చేశాడు. తాను యుద్ధం చేసేది లేదని శ్రీకృష్ణుడితో చెప్పాడు. ఎందుకు యుద్ధం చేయబోవడం లేదో కూడా సహేతుకంగా ఆయనకు వివరించాడు అర్జునుడు.
ఆశాపాశాలతో మాయామోహితుడైన అర్జునుడికి గీతోపదేశం చేసి కార్తవ్యోన్ము ఖుణ్ని చేశాడు కృష్ణుడు. మాయతెరలు తొలగిపోవడంతో కదన రంగంలో కాలుడయ్యాడు ఫల్గుణుడు. యుద్ధంలో విజయం కోసమే దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరూ కురుక్షేత్రం చేరారు. ఇద్దరూ వారి సహజ స్వభావాల వల్ల ప్రభావితులయ్యారు. వారి అభిప్రాయాలను విభిన్నంగా వ్యక్తం చేశారు. ఈ భిన్న ప్రవృత్తుల మధ్యగల ఆంతర్యాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీత 16వ అధ్యాయంలో సుర, అసుర లక్షణాలుగా వివరించాడు. ఆసురీ ప్రవృత్తి కలిగిన దుర్యోధనుడి లాంటివారు యుద్ధ ఫలితాన్ని తామే పూర్తిగా శాసిస్తామని అనుకుంటారు. ఆ అసుర స్వభావ లక్షణాల గురించి భగవానుడు ఇలా చెప్పాడు..
దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చl
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్ll (భగవద్గీత 16.4)
‘ఓ పార్థా! దంభం, దురహంకారం, గర్వం, క్రోధం, మొరటుతనం, అజ్ఞానం అనేవి ఆసురీ స్వభావం గలవారి గుణాలు’ అని వివరించాడు. ఈ స్వభావా లన్నీ దుర్యోధనుడిలో ఉన్నాయి. యుద్ధం విరమించమని పెద్దలు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టి మరీ తీవ్ర పరిణామాలకు కారణమయ్యాడు. మరోపక్క దైవీగుణ సంపన్నుడైన అర్జునుడు యుద్ధం వల్ల కలిగే దుష్పరిణామా లను, ప్రాణనష్టాన్ని అంచనా వేశాడు. కారుణ్యంతో యుద్ధాన్ని విరమించాలను కున్నాడు. కౌరవుల అకృత్యాల వల్లే యుద్ధం నెలకొన్నా, అర్జునుడు మాత్రం వారందరినీ క్షమించి, రాజ్యాన్ని సైతం త్యజించడానికి సిద్ధపడ్డాడు. అర్జునుడి దైవీగుణ సంపత్తిని సాక్షాత్తు భగవంతుడే ఇలా నిర్ధారించాడు.
దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతాl
మా శుచః సంపదం దైవీమ్ అభిజాతోసి పాండవ॥
(భగవద్గీత 16.5)
‘దైవీ గుణాలు మోక్షం దిశగా తీసుకెళ్తాయి. కానీ, ఆసురీ గుణాలు బంధనంలో చిక్కుకుపోవడానికి కారణమవుతాయి. బాధపడకు అర్జునా! నీవు దైవీ గుణాల తో జన్మించావు’ అని ఉద్బోధించాడు పరమాత్మ. ధర్మం కోసం జరుగుతున్న యుద్ధంలో పోరాడాల్సిన అర్జునుడు అజ్ఞానంతో తన కర్తవ్యాన్ని విస్మరిస్తే.. భగవానుడు తిరిగి కార్యోన్ముఖుడ్ని చేశాడు. పరమాత్మ ఉపదేశించిన దైవీ గుణాలు పెంపొందించుకోవడం అందరికీ సాధ్యమా? అంటే, నిత్యం భగవంతుడి సాంగత్యంతోనే అది సాధ్యమవుతుంది. దైవానుగ్రహం లేకుండా వాటిని పొందలేం. దైవ సాంగత్యానికి సాధనం భగవన్నామ స్మరణే!
–టి.వి.ఫణీంద్ర కుమార్