e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home చింతన స్థితప్రజ్ఞతే శిరోధార్యం

స్థితప్రజ్ఞతే శిరోధార్యం

హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్‌
తస్మా దుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః॥

  • భగవద్గీత (2-37)
స్థితప్రజ్ఞతే శిరోధార్యం

‘ఓ అర్జునా! నీవు ఒకవేళ యుద్ధంలో మరణిస్తే స్వర్గసుఖాలను అనుభవిస్తావు. అలా కాక, విజయం సాధిస్తే రాజ్యసుఖాలను పొందుతావు. కాబట్టి, యుద్ధం చెయ్యడానికే నిశ్చయించుకొని లేచి నిలబడు’ అన్న శ్రీకృష్ణ భగవానుని విలువైన వచనాలు కేవలం అర్జునునికే కాదు, సర్వమానవజాతికీ శిరోధార్యాలు. ఏ వ్యక్తి అయినా తన ధర్మాన్ని నిర్వహించవలసి వచ్చినప్పుడు మీనమేషాలు లెక్కబెడుతూ, సంశయిస్తూ, చేయవలసిన పనిని నిర్లక్ష్యం చేయరాదు. అది పిరికివాళ్ల లక్షణం. ఒక్కోసారి కర్తవ్య నిర్వహణలో ప్రాణాలైనా పోవచ్చు. ప్రాణాలమీది తీపితోనో, మరొక కారణంతోనో కర్తవ్య విముఖుడవడం మానవధర్మం కాదు. అర్జునుడు యుద్ధం చెయ్యవలసిన సందర్భంలో నిస్పృహుడై తనదైన క్షత్రియోచిత కర్తవ్యాన్ని పక్కకునెట్టి యుద్ధవిముఖుడైనాడు. తత్తాన్ని బోధిస్తూ పార్థసారథి అతనిని కర్తవ్యోన్ముఖుణ్ణి చేశాడు. ‘వీరుడు, ముఖ్యంగా అవసరమైనప్పుడు రాజు యుద్ధం చెయ్యవలసిందే. అదే రాజధర్మం. జయాపజయాలనేవి ముందుగానే నిర్ధారితం కావు. యుద్ధంలో వీరమరణమే సంభవిస్తే ‘వీరస్వర్గం’ అలంకరిస్తాడు. విజయం సాధిస్తే లక్ష్యం నెరవేరి ‘రాజ్యభోగాలు’ సిద్ధిస్తాయి. వీరుడైన వానికి జయం, అపజయం రెండూ ఒకటే. కాకపోతే, తనపై తనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇదే అతణ్ణి విజయం వైపు నడిపిస్తుంది.

- Advertisement -

పాండవ మధ్యముని విషయంలో ఇది సాధ్యం కావడం లేదు. అతని మానసిక దౌర్బల్యమే దీనికి ప్రధాన కారణం. అందుకే, స్వామివారు అనేక రీతుల్లో అర్జునునికి ఆత్మవిశ్వాస సిద్ధికోసం నడుం బిగించారు. తనకు విధించిన కర్తవ్యాన్ని నిబద్ధతతో పూర్తి చేసేవారికి ఎప్పుడైనా మంచే జరుగుతుంది. ధర్మాచరణ చేసేవాళ్లు తాత్కాలికంగా బాధలు పడవచ్చు. కానీ, ఎప్పటికైనా వారివైపు న్యాయమే నిలుస్తుంది. అర్జునుడు క్షత్రియ వంశసంజాతుడు. క్షత్రియ ధర్మమెంత క్లిష్టమైందైనా దాన్ని పాటించాల్సిందే. ఫలితమూ తప్పకుండా ఉంటుంది. ఆ మాటనే భగవానుడు తన శిష్యుడైన అర్జునునికి బోధిస్తూ, ‘యుద్ధానికి సిద్ధపడాల్సిన ధర్మకర్మ నీది. ఓడినా, గెలిచినా నీకు మంచే జరుగుతుంది. ఈ యుద్ధం చెయ్యడమే నీ ధర్మం’ అన్నాడు. తాను సారథిగా అర్జునునికి విషయం స్పష్టం చేస్తూ, అతణ్ణి యుద్ధానికి సిద్ధపరుస్తున్నాడు. ‘రణం అనివార్యమైంది కనుక, వెనుకడుగు వేయరాదు. అది క్షత్రియ జాతికంతా కూడా శాస్ర్తాలు విధించిన ధర్మం. దాన్ని మాత్రం వదలవద్దు’ అనీ అర్జునునికి వివరించాడు. ‘ఏది జరిగినా మన మంచికే’ అన్నది స్వామి భావన. ఒక విధంగా, ‘యుద్ధానికి కృతనిశ్చయుడవై లెమ్మని’ ఆజ్ఞాపించాడన్నమాట.

పై శ్లోకంలో ఒక విశేషం ఉంది. ‘హతోవా ప్రాప్స్యసి స్వర్గం’ అంటూ దీనిని ప్రారంభించాడు శ్రీకృష్ణ భగవానుడు. ముందుగా మరణాన్ని ప్రస్తావించడం వల్ల అర్జునుణ్ణి మరణం దిశగానే తొలుత సిద్ధం చేశాడు. ఇది ‘కీడెంచి మేలెంచడం’. ముందుగా కష్టతరమైన విషయానికే మనసు సిద్ధపడాలి. వైఫల్యాలకు ఏ మాత్రం భయపడకుండా ఉన్నప్పుడే విజయ సాధనవైపు అడుగులు పడతాయి. కర్మను ఆచరించకపోతే, జీవితం ఒక్క క్షణమైనా గడవదు. ఆ చేసేది ‘ధర్మబద్ధమైన కర్మ’ అయినపుడు అది తనతోపాటు సమాజానికీ ప్రయోజనకరం. నిరాశను, అసంతృప్తిని మనసులోనుండి తొలగిస్తేనే విజయాలు సాధ్యమై సత్ఫలితాలు అందుతాయి. ధర్మ కర్మాచరణకు ఈ స్థితప్రజ్ఞత అవసరం. అర్జునుణ్ణి అంతటి స్థితప్రజ్ఞుణ్ణి చేసే క్రమంలో చెప్పిన ఈ వచనాలు మానవాళి కంతటికీ గొప్ప ఆదర్శం.

గన్నమరాజు
గిరిజా మనోహర బాబు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స్థితప్రజ్ఞతే శిరోధార్యం
స్థితప్రజ్ఞతే శిరోధార్యం
స్థితప్రజ్ఞతే శిరోధార్యం

ట్రెండింగ్‌

Advertisement