ఓ గ్రామం పొలిమేరలో ఒక రైతు కుటుంబం ఉండేది. వారి కూతురు, పై చదువులకోసం నగరానికి వెళ్లాల్సి వచ్చింది. నగరానికి వెళ్లే ముందురోజు కూతురితో తల్లి ‘మంచివారితో స్నేహం చెయ్యి. చెడ్డవారితో స్నేహం చేయవద్దు’ అని హితవు చెప్పింది. ‘చెడ్డవారితో ఎందుకు స్నేహం చేయకూడదు. వారు కూడా మనుషులే కదా!’ అని కూతురు ఎదురు ప్రశ్న వేసింది. పెరట్లో కాకర చెట్టునుంచి కొన్ని కాకరకాయలు కోసుకురమ్మంది తల్లి. అలాగేనని చెప్పి లేత కాయలు కోసుకొని వచ్చింది కూతురు. వాటిని కుప్పగా పోసిన తల్లి అందులో సగం కాయలను అప్పటికప్పుడే వండమంది. కమ్మటి కాకరకాయల కూర చేసింది కూతురు. మిగిలిన కాయలను గిన్నెలో పోసి ఊళ్లో నాలుగు వీధుల్లో ఉన్న చేదబావుల్లోని నీళ్లతో కడుక్కురమ్మంది. తల్లి చెప్పినట్లే కూతురు ఊళ్లో నాలుగు వీధుల్లోకి వెళ్లింది. అక్కడి బావి నీళ్లతో ఒకటికి రెండుసార్లు వాటిని శుభ్రంగా కడుక్కుని వచ్చింది.
వాటినీ వండమంది తల్లి. శ్రద్ధగా చక్కటి కాకర కాయల కూర చేసింది కూతురు. మొదటగా చేసిన కూరను కూతురికి వడ్డించిన తల్లి ‘ఎలా ఉంది?’ అని ప్రశ్నించింది. ‘కాకరకాయ కథ తెలిసిందే కదా, చేదుగా ఉంది!’ అని బదులిచ్చింది కూతురు. రెండోసారి చేసిన కూరను వేస్తూ ‘ఇది నాలుగు బావుల నీళ్లతో కడిగిన వాటితో చేసింది కదా, దీని చేదు పోయి ఉంటుంది, తిని చూడు’ అని చెప్పింది తల్లి. కూరను నోట్లో పెట్టుకున్న కూతురు ‘ఇది కూడా చేదుగానే ఉంది’ అని చెప్పింది. అప్పుడు తల్లి నవ్వుతూ ‘కాకరకాయలను బావుల్లోనే కాదు, నదుల నీటితో కడిగినా దాని చేదు పోదు. చేదుగా ఉండటం కాకరకాయ సహజ లక్షణం. కాబట్టి అది చేదుగానే ఉంటుంది. అలాగే కొందరు దుష్ట మనుషుల నైజం కూడా. వారిని మనం మార్చాలని ప్రయత్నించడం కన్నా వారికి దూరంగా ఉంటేనే మంచిది’ అని చెప్పింది. అలాగేనని తల ఊపింది కూతురు….?
-ఆర్సీ కృష్ణస్వామి రాజు,
93936 62821