ఓ ఆశ్రమంలోని భజన మందిరంలో ప్రతి పౌర్ణమి నాడు భజన, సత్సంగం జరుగుతాయి. ఓ యాభై ఏండ్ల వైద్యుడు మందిరంలో మూలగా కూర్చుని ఉండటం గురువు గమనించాడు. వాడిపోయిన ముఖంతో ఉన్న ఆయన ఏదో మొక్కుబడిగా భజన చేస్తున్నట్టు అనిపించింది. భజన పూర్తయ్యాక గురువు ఆ వైద్యుడిని పిలిచి ‘అంత నిరుత్సాహంగా ఉన్నారేం?’ అని అడిగాడు. ‘మంచి వైద్యుడిగా పెద్దపేరు, అనుకూలవతి అయిన భార్య, ప్రయోజకులైన పిల్లలు.. ఇన్ని ఉన్నా, నా మనసులో ఏదో అశాంతి ఉంటున్నది’ అని చెప్పాడు వైద్యుడు.
‘ప్రతి ఆదివారం మీ స్వగ్రామానికి వెళ్లి, తోబుట్టువులతో ఆ రోజంతా గడుపు’ అని సలహా ఇచ్చాడు గురువు. ‘మేమంతా వేరుపడి చాలా ఏండ్లయింది. ఇప్పుడు ఎవరి దారి వారిది. ఇప్పుడు కొత్తగా కలవడం అంటే..’ అని నీళ్లు నమిలాడు వైద్యుడు. ‘వారు నీకు కొత్తవారు కాదు. మీరంతా ఒక తల్లి బిడ్డలు. నీ రాకను వాళ్లు స్వాగతిస్తారు. తోబుట్టువులు చెట్టుకు కొమ్మల్లాంటి వారు. వేర్వేరు దిశల్లో అవి పెరిగినా.. వాటి మూలాలు మాత్రం ఒకటే. వెళ్లి వారిని కలువు. నీ నిరాశ, నిస్పృహలన్నీ చెయ్యితో తీసేసినట్టుగా పోతాయి’ అని సలహా ఇచ్చాడు గురువు. తన మాటలకు తటపటాయిస్తున్న వైద్యుడితో మళ్లీ..
‘గతంలో వారితో ఏమైనా అభిప్రాయభేదాలు తలెత్తి ఉంటే వాటిని మర్చిపో! మనుషులు ఎప్పుడూ ఒకలా ఉండరు. మార్పు అనేది ప్రకృతి సహజం. ఏదీ నిన్నటిలా ఉండదు. మనుషుల మనసులూ అంతే’ అని ధైర్యం చెప్పాడు. ‘తప్పకుండా కలుస్తాన’ని చెప్పి వెళ్తున్న వైద్యుడితో గురువు ‘అలా ఊరికి వెళ్లినప్పుడు నీ చిన్ననాటి మిత్రులను కూడా కలుసుకో’ అని చెప్పాడు. నెల తర్వాత మళ్లీ పౌర్ణమికి వైద్యుడు ఆశ్రమానికి వచ్చాడు. ఆయన ముఖంలో నిరాశ లేదు.
ఆనందంగా ఉన్నాడు. ‘ఇంత చిన్న కిటుకు తెలియక.. నిరంతరం ఏదో పోగొట్టుకున్న వాడిలా కాలం గడిపాను. అనుబంధమనే చికిత్సను గుర్తించక.. ఎన్ని మాత్రలు మింగానో. మీ సలహా నాలో కొత్త ఉత్సాహానికి దారి చూపింది’ అని గురువుతో చెప్పి భజనలో చురుగ్గా పాల్గొన్నాడు వైద్యుడు.
…? ఆర్సీ కృష్ణస్వామి రాజు,
93936 62821