ఘన వాసన మేతత్తు చేతః కర్తృత్వ భావనమ్
సర్వ దుఃఖప్రదం తస్మాత్ వాసనాం తనుతాం నయేత్
(అన్నపూర్ణోపనిషత్తు 1-31)
‘మనసు కర్తృత్వంతో ఉంటే ఘనవాసన కలది అవుతుంది. ఆ స్థితే సమస్త దుఃఖాలనూ కలిగిస్తుంది. కాబట్టి వాసనలను నశింపజేసుకోవాలి…’ అని భావం. ‘నేను చేస్తున్నాను’ అనే భావనే కర్తృత్వ భావన. దానినే ఆధ్యాత్మిక పరిభాషలో ‘వాసన’ అంటారు. ఒకే పనిని పదేపదే చేస్తూపోతే ఈ భావన క్రమంగా బలపడిపోతుంది. అది బలంగా మనసులో పాతుకుపోయి ఉన్నంత కాలం దుఃఖం తప్పదు. ఉన్న రహస్యమంతా ఇందులోనే ఉన్నది. ఒకసారి రామకృష్ణ పరమహంస మాట్లాడుతూ విజయకృష్ణ గోస్వామికి ఓ కథ చెప్పాడు. ‘ఒకరోజు జాలరులు చేపలు పడుతున్నారు. ఇంతలో పైనుంచి ఒక గద్ద రివ్వున వచ్చి ఓ చేపను తన్నుకు పోయింది. వెంటనే ఎక్కడినుంచి వచ్చాయోగాని కాకులన్నీ గుమిగూడాయి. నానా గోల చేస్తూ గద్ద ఎటు వెళ్తే అటు తరమసాగాయి.
ఆ అయోమయంలో వేళ్ల నుంచి చేప ఉన్నట్టుండి జారి పడిపోయింది. మరుక్షణంలో కాకులన్నీ గద్దను వదిలిపెట్టి చేప కోసం ఎగిరిపోయాయి. కాకుల నుంచి తప్పించుకునే క్రమంలో అలసిపోయి చికాకుపడిన గద్ద ఓ చెట్టు కొమ్మమీద వాలి ఊపిరి పీల్చుకుంది. తర్వాత తన మనసులో ‘అయ్యయ్యో! ఈ చేపనే కదా అన్ని ప్రమాదాలకు మూల కారణం! అది నన్ను వదిలి పోయిన వెంటనే నాకు చెప్పలేనంత మనశ్శాంతి కలిగింది’ అని అనుకున్నది. ఈ కథ చెప్పి పరమహంస ‘ఎంతవరకైతే చేప అనే ప్రాపంచిక వాసన మనసును అంటిపెట్టుకొని ఉంటుందో.. అంతవరకూ జీవుడు కష్టాలలో గిలగిలా కొట్టుకుంటూనే ఉంటాడు. ఎప్పుడు ఆ వాసన.. అంటే తీవ్రమైన కోరిక ఒక్కసారి విడిచిపెట్టి పోయిందో ఆ క్షణంలోనే ఆత్మశాంతి అనంతంగా లభిస్తుంది’.