e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News షట్‌ స్థలాలు.. అరుదైన వరాలు!

షట్‌ స్థలాలు.. అరుదైన వరాలు!

నేను అనే అస్తిత్వపు అనుభూతిని, చైతన్యపు విభూతిని అనంతత్వంలోకి, అమృతత్వంలోకి విస్తరింపజేసుకోవడమే ఆధ్యాత్మిక సాధన. సారభూతంగా ఆ విస్తరణమే శ్రేయస్సు. లౌకిక జీవితంలో దానికి ఉప ఫలంగా కలిగే దుఃఖవిముక్తి, సుఖప్రాప్తియే ప్రేయస్సు. ఆధ్యాత్మికత సగుణం నుంచి నిర్గుణం వైపు, అంటే నామరూపాల పరిమితి నుంచి పరిమితిలేని సచ్చిదానంద పరబ్రహ్మం వైపు సాగే సాధన. ఏ అడ్డూ, ఆపూలేని విశృంఖలమైన సహజాతాలను సమయబద్ధమైన, సందర్భబద్ధమైన విధి నిషేధాల ద్వారా లోకహితకర సంస్కారంగా, సామాజిక సంప్రదాయంగా ప్రవహింపజేయడమే సంస్కృతి. ఆ సంస్కృతి ద్వారా నిరపేక్షానందాన్ని పండించుకునే విశిష్టమైన నిష్ఠ ఆధ్యాత్మికత.

వీరశైవం ఆధ్యాత్మిక ప్రస్థానంలో ఆరు స్థానాలను పేర్కొన్నారు. వీటిని స్థాయులు, తలాలుగా భావిస్తారు. ఈ ఆరింటినీ కలిపి షట్‌ స్థలాలు అన్నారు. అవి భక్త, మహేశ, ప్రసాది, ప్రాణలింగి, శరణ, ఐక్య స్థలాలు. ఇందులో ప్రారంభ స్థాయి భక్త స్థలం. ఇది మొదటి మెట్టు. నిష్ఠను బలపరచుకునే దృష్టికి, ఆచరణకు సంబంధించింది. నిర్గుణ సచ్చిదానంద సదాశివం పట్ల, దానికి సంకేతంగా ధరించిన ఇష్టలింగం పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని, వాటి మధ్య అభేద దృష్టిని కలిగి ఉండటం. అంతేకాదు శివలింగానికి, శివభక్తుడికి అంటే జంగమునికి మధ్య అభేద భావాన్ని అచంచలంగా కలిగి ఉండటం. వారితో ఒక సేవకునిగా, దాసునిగా, భృత్యుడిగా పరమ నిరహంకారంతో వ్యవహరించడమే భక్త స్థలం. రెండో స్థాయి మహేశ స్థలం. సత్యం, అహింస, శుచి, అస్తేయం పాటించడం. పరధనం పట్ల, పరస్త్రీ పట్ల ఎలాంటి కాముకత లేకపోవడం. పరనింద వీడి పరమ శివనిష్ఠతో జీవించడం మహేశ స్థలం.

- Advertisement -

మూడోమెట్టు ప్రసాది స్థలం. తాను ఇంద్రియాల ద్వారా పొందే ప్రతి విషయాన్నీ, ఏ మినహాయింపూ లేకుండా సమస్తం శివార్పణం చేసి, దానిని శివప్రసాదంగా మాత్రమే స్వీకరించడం. అంటే ఒకరకంగా తన అనుభవాన్నంతా ఈశ్వర ప్రసాద ధారగా చేసుకోవడమే ప్రసాది స్థలం. నాలుగోది ప్రాణలింగి స్థలం. లింగమే తన ప్రాణంగా, తన ప్రాణమే లింగంగా భావించి, అన్ని పరస్పర విరుద్ధ పరిస్థితులలో సమశాంత చిత్తంతో జీవించడం. సుఖమైనా, దుఃఖమైనా శివానుభవంగా మలచుకోవడం. పక్షపాతాలను భ్రాంతిగా విడిచి బతకడమే ప్రాణలింగి స్థలం. ఈ స్థాయిలో జీవితం ఒక శుద్ధ శివప్రవాహం అవుతుంది.

ఐదో మెట్టు శరణ స్థలం. శివలింగాన్నే పతిగా భావించి, దానికి అధీనమైన సతిగా పాతివ్రత్యంతో జీవితం సాగించడం. అంటే తన ఎరుకను పూర్తిగా శివమయంగా చేసుకొని, జీవితాన్ని సంపూర్ణ శివశిల్పంగా మలచుకోవడమే శరణ స్థలం. చివరిది, అత్యున్నమైన ఆరోస్థాయి ఐక్య స్థలం. లౌకికమైన అన్ని కోరికలను పెరికివేసి, అన్ని బంధనాలు రాల్చేసి, అర్చనాది కర్మలనూ వదిలేసి పరమ నిష్కామంతో, నిర్భీతితో జీవన్ముక్తుడిగా ప్రగాఢమైన శివాద్వయస్థితిలో మనడమే శిఖరస్థాయి సమానమైన ఐక్య స్థలం.

ఈ విధంగా సాధకుడు మొదటి స్థాయిలో భక్త స్థలంలో విశ్వాసనిష్ఠను, వినయాన్ని సుస్థాపనం చేసుకుంటాడు. రెండో స్థాయిలో మహేశ స్థలంలో పరిశుద్ధతను, త్యాగనిరతిని ప్రోది చేసుకుంటాడు. మూడోదైన ప్రసాది స్థలంలో కృతజ్ఞతను, శివప్రసాద మాధుర్యతను సొంతం చేసుకుంటాడు. నాలుగో స్థాయి ప్రాణలింగి స్థలంలో సమత్వాన్ని, సమున్నతత్వాన్ని పెంపొందించుకుంటాడు. ఐదోదైన శరణ స్థలంలో శివాత్మీయతతో జీవితాన్నే మహాశివ శిల్పంగా మలచుకుంటాడు. ఆరోస్థాయి అయిన ఐక్య స్థలంలో శివాద్వయానుభూతితో జీవన్ముక్త స్థితిని సిద్ధింపజేసుకుంటాడు.

యముగంటి ప్రభాకర్‌
94401 52258

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement