Bhu Bharathi | జనగామ, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి కొందరు అక్రమార్కులకు సర్కార్ ఖజానాను కొల్లగొట్టే సాధనంగా మారినట్టు తెలుస్తున్నది. వెబ్‌సైట్‌లోని లొసుగులను ఆసరా చేసుకొని కొందరు కొద్దినెలలుగా రాష్ట్రవ్యాప్తంగా గుట్టుచప్పుడు కాకుండా డిజిటల్ ఫ్రాడ్‌కు పాల్పడుతూ రూ. కోట్లు దోచుకున్నట్టు సమాచారం.
ధరణి సైట్ కంటే దీటైనదని కాంగ్రెస్ పెద్దలు చెప్పుకున్న భూభారతి లొసుగుల కుంపటిగా ఇప్పుడు బట్టబయలైంది. కేటుగాళ్లు రాష్ట్రవ్యాప్తంగా తమ నెట్వ ర్క్ ద్వారా మీ సేవ, స్లాట్ బుకింగ్ నిర్వాహకులకు ఎక్కువ కమీషన్ ఆశజూపి అక్రమ వ్యవహారాన్ని నడిపినట్టు తెలుస్తున్నది. తమ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ల సొమ్ము ప్రభుత్వ ఖజానాలో జమ కాకుండా పక్కదారి పట్టించారని తెలిసింది. తాజాగా, జనగామ జిల్లా కేంద్రంలో ‘భూ భారతి’ రిజిస్ట్రేషన్ చార్జీల చెల్లింపులో జరిగిన అక్రమాలు.. మీ సేవ కేంద్రాలు, స్లాట్ బుకింగ్ సెంటర్ల నిర్వాహకుల మాయాజాలం వెలుగుచూడటంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఈ ‘తీగ’ జనగామలో బయటపడినా.. కీలక సూత్రధారి హైదరాబాద్ కేంద్రంగా తన నెట్‌వర్క్‌ను విస్తరించి అన్ని జిల్లాలు, పట్టణ, మండల కేంద్రాల్లో ఉన్న మీసేవ, స్లాట్ బుకిం గ్ సెంటర్ల ద్వారా కొనసాగిస్తున్నట్టు సమాచారం. స్లాట్ బుకింగ్ మొదలు రిజిస్ట్రేషన్ వరకు సాఫ్ట్‌వేర్‌లోని లొసుగులను వాడుకుంటున్న కేటుగాళ్లు భూ లావాదేవీల్లో కొనుగోలుదారుల నుంచి పూర్తిస్థాయిలో డబ్బులు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించకుండా పక్కదారి పట్టించినట్టు తెలుస్తున్నది.
సైబర్ కేటుగాళ్ల పనా? ఇంటిదొంగల ప నా? అన్న కోణంలో సైబర్‌క్రైం పోలీసులు ద ర్యాప్తు చేపట్టారు. సర్కార్ ఖజానాకు చేరవలసిన సొమ్ములో ఏ మేరకు దోపిడీకి గురవుతున్నది, సాఫ్ట్వేర్ డెవలపర్‌కు తెలియకుండానే ఈ తతంగం జరిగిందా? అని విచారణ చేప ట్టారు. ఇప్పటికి మీ సేవ నిర్వాహకుడు సహా ముగ్గురిని అదుపులోకి తీసుకొని కూపీ లాగుతున్నట్టు తెలిసింది. మరోవైపు ఈ కుంభకోణం కాంగ్రెస్ సర్కార్ పరువు, ప్రతిష్ఠలకు సవాలు విసరడంతో.. ఈ వ్యవహారాన్ని బయటకు పొ క్కనివ్వకుండా ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్న ట్టు తెలిసింది. మొక్కుబడి విచారణతో నేరాన్ని కొందరిపై మోపి చిన్న మొత్తంలోనే ఫ్రాడ్ జరిగిందని చెప్పి కప్పిపుచ్చే ప్రయత్నంలో అధికారులు తలమునకలైనట్టు సమాచారం.
భూముల క్రయవిక్రయాలను రిజిస్ట్రేషన్ చే యడానికి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా భూభారతి పోర్టల్‌లోకి వెళ్లి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను చెల్లించి స్లాట్‌బుక్ చేసుకోవచ్చు. చాలామంది సరైన అవగాహన లేక మీసేవ కేంద్రాలు, నెట్ సెంటర్లు, తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఉండే డాక్యుమెంట్ రైటర్లను ఆశ్రయించి స్లాట్‌బుకింగ్ చేసుకొని వారికే డబ్బులు చెల్లిస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకొని అక్రమార్కులు ఈ దోపిడీకి తెర లేపి ప్రభుత్వాన్ని.. రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ప్లాట్లు, భూములు కొనుగోలు చేసే వారు స్లాట్ బుక్ చేసుకొని, రిజిస్ట్రేషన్ చార్జీలను ఆన్లైన్లో చెల్లించి సంబంధిత పత్రాలు, రసీదులను తీసుకొని అటు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో, వ్యవసాయ భూములైతే ఇటు తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటారు. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ రసీదులపై చెల్లించే మొత్తం సరిగానే ఉంటు న్నా.. ప్రభుత్వ ఖజనా(ట్రెజరీ)లో మాత్రం అతితక్కువగా జమ అవుతున్నది. ఉదాహరణకు రూ.8,000 చెల్లిస్తే.. ఖజనాలో మాత్రం రూ.800 మాత్రమే జమవుతున్నాయి. చెల్లించిన సొమ్ముకు సంబంధించిన సంఖ్య చివరి ఒకటి లేదా రెండు అంకెలను తొలగించి లేదా మార్ఫింగ్ చేస్తున్న మీ సేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల నిర్వాహకులు తక్కువ మొతాన్ని ట్రెజరీకి జమ చేసి ఎక్కువ మొత్తాన్ని తమ వ్యక్తిగత ఖాతాలోకి లేదా లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చిన సంబంధిత మోసగాడి ఖాతాకు మళ్లించుకుంటున్నారు. అయితే, పోర్టల్‌ను హ్యాక్ చేసి ఇలా చేస్తున్నారా? లేదా లింక్ ద్వారా ప్రభుత్వ ఖాతాలకు తక్కువ మొత్తం లో, వ్యక్తిగత ఖాతాలకు ఎక్కువ మొత్తంలో జమ అయ్యేలా సాఫ్ట్వేర్ తయారుచేశారా? లేక దీని వెనక ఇంకేమైనా పెద్ద నెట్వర్క్ పనిచేస్తున్నదా? అన్నది తేలాల్సి ఉంది.
వెబ్సైట్, సాఫ్ట్‌వేర్‌లోని లొసుగులను ఆస రా చేసుకొని ఈ దోపిడీకి పాల్పడ్డారా లేక డెవలపర్ స్థాయి నుంచే కొద్దిమందికి ఏమైనా సంబంధాలున్నాయా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాదగిరిగుట్టకు చెందిన ఒక యువకుడు భూ రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే యజమానులను టెక్నాలజీ ద్వారా బోల్తా కొట్టించాడని తేలినట్టు సమాచారం. ఆ యువకుడికి సాఫ్ట్వేర్ డెవలపర్‌తో ఉన్న సంబంధాలు, హైదరాబాద్‌లోని మరికొద్దిమందితో ఉన్న లింకులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కొద్దినెలల క్రితం కొడకండ్లలో మీ సేవ నిర్వాహకుడు ఒకరు తన ఐడీ ద్వారా లాగిన్ అయి స్లాట్లు బుకింగ్ చేస్తే సాధారణగా వచ్చే కమీషన్ కంటే రెట్టింపు ఇస్తానని అక్కడ భూముల స్లాట్ బుకింగ్ నిర్వాహకులకు ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. అతడి పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నట్టు సమాచారం. కమీషన్ల రూపంలో ఎవరెవరితో లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయి? ఎన్ని రోజుల నుంచి ఈ వ్యవహారం నడుస్తున్నది? ఆ యువకుడు ఎంతమందికి ఎన్ని స్లాట్లు బుక్ చేశాడు? జరిగిపోయిన రిజిస్ట్రేషన్లు ఎన్ని? వాటి ద్వారా ఖజానాకు ఏ మేరకు నష్టం జరిగింది? అనేది తేలాల్సి ఉంది.
జనగామలో జరిగిన భూముల క్రయవిక్రయాలకు సంబంధించి ఒక్కరోజే రూ.8 లక్ష లు అక్రమార్కుల జేబుల్లోకి మళ్లినట్టు గుర్తించారు. కేవలం 10 రిజిస్ట్రేషన్ల ద్వారానే ప్రభుత్వానికి రూ.8.55 లక్షల నష్టం వాటిల్లినట్టు తెలిసింది. ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ల సొమ్ములో కొద్దిరోజులుగా భారీ తేడాలను గమనించిన తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. రసీదుల మేరకు రావాల్సిన మొత్తం కంటే చాలా తక్కువగా ఖజానాలో జమ అయిన విషయా న్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. దీంతో జనగామకు చెందిన ఇద్దరితోపాటు యాదాద్రి జిల్లాకు చెందిన మీసేవ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఒక జనగామ మీ సేవ కేంద్రంలో రూ.8 లక్షల అవినీతి జరిగిందంటే రాష్ట్రవ్యాప్తంగా భూభారతి వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎంత గండి పడి ఉంటుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.