ఓ గ్రామంలో రాములవారి గుడి ఉంది. ఒకరోజు అక్కడికి వచ్చిన ఉపన్యాసకుడు అరిషడ్వర్గాల గురించి ప్రసంగించాడు. ‘కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అంటారు. ఇవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తాయి. మనిషి పతనానికి, ప్రకృతి వినాశనానికి కారణమవుతాయి. వీటిని ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్థం, సంకుచిత భావాలతో నిండి ఉంటుంది’ అని వివరించాడు. ఉపన్యాసం పూర్తయ్యాక ఆయన అక్కడినుంచి బయల్దేరబోయాడు. గుడి ముందు అంగడి పెట్టుకుని ఉన్న వ్యాపారి ఆయన దగ్గరికి వచ్చాడు. ‘మీరు మీ ఉపన్యాసంలో అనేకసార్లు ‘తన కోపమే తన శత్రువు’ అని చెప్పారు. అది ఎలా?’ అని అడిగాడు. ‘నువ్వు ఏం చేస్తూ ఉంటావు?’ అని ప్రశ్నించాడు ఉపన్యాసకుడు.
‘ఈ గుడి ముందు కొబ్బరికాయలు, కర్పూరం, అరటిపండ్లు, సాంబ్రాణి, ఒత్తులు, అగ్గిపెట్టె లాంటివి అమ్ముతూ ఉంటాన’ని బదులిచ్చాడు వ్యాపారి. వెంటనే ఉపన్యాసకుడు ‘అగ్గిపెట్టెలోని అగ్గి పుల్లలతో మనం ఏం చేస్తాం?’ అని ప్రశ్నించాడు. ‘వేరే వాటిని కాల్చడానికి అగ్గిపుల్లలను ఉపయోగిస్తాం’ అని సమాధానం ఇచ్చాడు వ్యాపారి. ఉపన్యాసకుడు చిన్నగా నవ్వి ‘అగ్గిపుల్లని గీసినప్పుడు ఏమి జరుగుతుందో గమనించావా?’ అని మళ్లీ ప్రశ్నించాడు. ‘అందరికీ తెలిసిందే కదా, మొదట అగ్గిపుల్ల కాలడం జరుగుతుంది’ అని తేలికగా చెప్పాడు వ్యాపారి. ‘తను కాలకుండా అగ్గిపుల్ల వేరే వాటిని కాల్చగలదా?’ అని సూటిగా అడిగాడు ఉపన్యాసకుడు.
క్షణం ఆలోచించి ‘కుదరదు కాక కుదరద’న్నాడు వ్యాపారి. ‘అలాగే కోపమొచ్చిన మనిషి కూడా! మనం కోపంతో ఉన్నప్పుడే.. ఎదుటివారిపై కోపాన్ని వ్యక్తం చేయగలం. అంటే ఎదుటి వ్యక్తికి నష్టం జరగడాని కన్నా ముందే మనకు నష్టం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం తెలుసుకోవల్సింది ఏమిటంటే, మాట అన్నవాడు, మాట అనిపించుకున్న వాడు… ఇద్దరూ ఇబ్బంది పడతారు. అందుకే తన కోపమే తన శత్రువు’ అని చెప్పాను అని వివరించాడు ఉపన్యాసకుడు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు, 93936 62821