సత్యం జ్ఞానమనంతం యద్బ్రహ్మా తద్వస్తు తస్యతత్ ఈశ్వరత్వం జీవత్వముపాధిద్వయ కల్పితం॥ అంటుంది వేదాంత పంచదశి. సత్యం, జ్ఞానం, అనంతం అనే లక్షణాలతో పేర్కొన్న పరబ్రహ్మం ఏది కలదో అదే వస్తువు (పరమార్థం). ఆ పరబ్రహ్మం ఈశ్వరత్వం, జీవత్వం అనే రెండు ఉపాధులు కలిగి ఉంటుంది.
ప్రపంచం ఏర్పడేందుకు మూలకారణమైన ప్రకృతి త్రిగుణాత్మకమైంది. అంటే సత్వ, రజస్తమో గుణాలు కలది. జ్ఞానం, స్వచ్ఛత, శాంతి మొదలైన వృత్తులకు సత్వగుణం, కామం, క్రోధం మొదలైన వాటికి రజోగుణం, అలాగే మూఢత్వం, సోమరితనం మొదలైన వృత్తులకు తమోగుణాలు కారణాలు. శుద్ధ సత్తం అంటే రజస్తమో గుణాల కలయిక లేని నిర్మలమైన సత్వగుణమే ‘మాయ’.
ఈ మాయాశక్తి ఉపాధిగా కలవాడు ఈశ్వరుడు. ఇతడు సర్వనియామకుడు. సర్వజ్ఞుడు, శాసకుడు. మాయను అధీనంలో ఉంచుకొని ప్రపంచకార్యాలు నిర్వహించువాడు. మలిన సత్తం అంటే రజస్తమో గుణాల కలయిక కలిగినది. అవిద్య, అజ్ఞానం. వీటిని ఉపాధిగా కలవాడు జీవుడు. మాయకు వశుడు. మాయలో ప్రతిబింబించిన బ్రహ్మం ఈశ్వరుడు అయితే, అవిద్యలో ప్రతిబింబించే బ్రహ్మం జీవుడు. ఈ విధంగా ఒకే పరబ్రహ్మం ఉపాధి భేదం కారణంగా ఈశ్వరునిగా, జీవునిగా ఉన్నాడు.