‘నీవలె నీతోటి మనిషిని ప్రేమించాలి’ అంటాడు ప్రభువు. మనల్ని మనం ఎంత ప్రేమగా చూసుకోగలమో, అంతే ప్రేమతో సాటివారినీ చూడాలి అని చెప్పడం తేలికే! కానీ, ఆచరణలో ఇది చాలా కష్టం. కానీ, ప్రేమ ఉంటే అది సాధ్యమే! ఆ ప్రేమ.. దేవుణ్ని ప్రేమించే ప్రేమ. అదే ప్రేమతో మనిషినీ చూడాలి. మనిషిలో దేవుణ్ని చూడగలిగితే, ప్రతిమనిషిలోనూ దేవుడున్నాడని నమ్మగలిగితే, అదే దేవుడు నీలో, నాలో, అందరిలోనూ ఉన్నాడనీ విశ్వసిస్తే.. మనిషికి శత్రువులు ఎందుకు ఉంటారు! అందరిలోనూ ప్రేమమయుడైన దేవుడున్నాడని నమ్మగలిగితే.. ద్వేషానికి తావులేదు.
హింసకు అవకాశమే ఉండదు. ఒకడు మరొకణ్ని దోపిడీ చేయలేడు. సర్పాన్ని చూసి మనం భయపడతాం. వాస్తవానికి మనిషి అలికిడి కాగానే.. సర్పమే పక్కకు జారుకుంటుంది. అంతేగాని కనిపించిన మనిషిపైకి వచ్చి కాటువేయదు. కారణం మనం అంటే దానికీ భయమే! కానీ, మనిషి.. మరో మనిషికి భయపడుతున్నాడు. అందుకు కారణం ప్రేమ లేకపోవడమే. మానవత్వం అంటే ఏంటో తెలియకపోవడం, సానుభూతి మృగ్యం కావడంతోనే మనిషి.. మనిషికి శత్రువుగా మారుతున్నాడు. అందుకే ప్రభువు ‘నీ దేవుణ్ని ఆరాధించు, పక్కవాణ్ని ప్రేమించు, దైవారాధనను ప్రేమలా మార్చుకో’ (మార్కు 12:30-31) అని బోధించాడు. ఈ సత్యాన్ని గ్రహిస్తే అప్పుడు వైషమ్యాలు లేని సమాజం ఏర్పడుతుంది.
– ప్రొ॥ బెర్నార్డ్ రాజు, 98667 55024