ఒకానొక జ్ఞాని తన అనుచరులతో ఒక పల్లెలో పర్యటిస్తున్నాడు. గ్రామంలో పచ్చని చెట్ల మధ్య ఒక బడి ఉంది. అందులో ఉపాధ్యాయుడు పిల్లలకు పాఠం చెబుతున్నాడు. జ్ఞాని కాసేపు అక్కడే నిలబడి కండ్లు మూసుకొని ఆ పాఠం విన్నాడు. కాసేపయ్యాక బయల్దేరుతూ ‘ఉపాధ్యాయుడు పాఠం బాగానే చెబుతున్నాడు’ అన్నాడు. అనుచరులు తలలూపారు. జ్ఞాని బృందమంతా చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ సాయంత్రానికి మరో పల్లెకు చేరుకున్నది. అక్కడ గుడి దగ్గర ఒక వృద్ధుడు కొందరిని కూర్చోబెట్టుకొని నాలుగు మంచి విషయాలు చెబుతున్నాడు. జ్ఞాని పక్కగా నిలబడి ఆ మాటలు విని ‘ఈ గురువు చెప్పిన మాటలు జీవిత సత్యాలు’ అన్నాడు. అప్పుడు అనుచరుల్లో ఒకరు ‘స్వామీ! ఉదయం పాఠాలు చెప్పిన వ్యక్తిని ఉపాధ్యాయుడు అన్నారు.
ఈ వృద్ధుడిని గురువు అని సంబోధించారు. ఇద్దరూ జ్ఞానాన్ని పంచేవారే కదా! ఒక్కొక్కరినీ ఒక్కోరకంగా ఎందుకు పిలిచారు?’ అని అడిగాడు. దానికి జ్ఞాని నవ్వి ‘నా దృష్టిలో గురువుకూ, ఉపాధ్యాయుడికీ మధ్య చాలా తేడా ఉంది. గురువు మన అంతరంలోని జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాడు. ఉపాధ్యాయుడు బయట ఉన్న విజ్ఞాన కాంతులను పరిచయం చేస్తాడు. మనకు ఇద్దరూ అవసరమే! ఇద్దరూ అనుసరించదగ్గవారే! అయితే గురువులంతా ఉపాధ్యాయులు కాలేరు, ఉపాధ్యాయులంతా గురువులూ కారు! మనం చేయాల్సిందల్లా ఉపాధ్యాయుడు చెప్పే పాఠాలను శ్రద్ధగా నేర్చుకోవాలి. గురువు చెప్పే తత్వాన్ని అవగాహన చేసుకొని మనలోని జ్ఞానకాంతిని ప్రకాశింపజేసుకోవాలి’ అని బోధించాడు.
…? ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 9393662821