ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (స) వీధిలో వెళ్తుండగా ఒక స్త్రీ ఆయన్ను ఆపి హజ్ గురించి ఏదో సందేహం అడిగింది. అప్పుడు ప్రవక్త వెంట ఉన్న సహచరుల్లో ఒకరు ఆ మహిళను తదేకంగా చూడసాగాడు. దైవ ప్రవక్త (స) అది గమనించి ఆ యువకుడి తలని పట్టుకుని వేరేదిక్కుకు తిప్పారు. పరస్త్రీలను కన్నెత్తి కూడా చూడరాదని ప్రవక్త బోధనల సారాంశం. మహిళపై దృష్టి పడితే వెంటనే చూపు మరల్చుకోవాలని ప్రవక్త ప్రబోధం. వక్రదృష్టితో మహిళను చూడటం అంటే కంటితో చేసే వ్యభిచారం లాంటిదే. ‘పరస్త్రీపై యాదృచ్ఛికంగా దృష్టి పడగానే మరల్చుకోవాలి.
మొదటి చూపు నీదేకాని, రెండో చూపు సైతాన్ చూపు’ అన్నారు ప్రవక్త. ఉమ్మె ఖలాద్ (రజి) అనే మహిళ కొడుకు యుద్ధంలో మరణించాడు. కొడుకు పరిస్థితిని విచారించడానికి ఆమె ప్రవక్త దగ్గరికి వచ్చింది. ఆమె పరదా ధరించి ప్రవక్తతో మాట్లాడింది. ‘ఇంతటి విషాద వేళలోనూ తాపీగా పరదా ధరించి వచ్చావా’ అని కొందరు అడిగారు. దానికామె ‘నేను కొడుకును పోగొట్టుకున్నాను. కానీ, సిగ్గు బిడియాలను కాద’ని అన్నది. స్త్రీలు కూడా పర పురుషులను ప్రయత్నపూర్వకంగా కండ్లు చించుకొని చూడరాదన్నది ఇందులో సారాంశం. స్త్రీ పురుషులిద్దరూ తమ చూపులను అధీనంలో ఉంచుకోవాలి. వికృత మనసుతో ఎదుటివారిని చూడటం నేరమే!
…?ముహమ్మద్ ముజాహిద్, 96406 22076