ఆధ్యాత్మిక ప్రపంచంలో ‘ఓం తత్ సత్’ ఈ మాట తరచూ వినిపిస్తుంది. దీనికి అర్థం ఏమిటి? ఈ మూడు అక్షరాల గొప్పదనాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో వివరించాడు. వీటిలోని సత్యాన్ని, ప్రభావాన్నీ 17వ అధ్యాయంలో బోధించాడు. సాధనలో యజ్ఞం, దానం, తపస్సు ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తాయి. ధార్మికజనులు ఈ మూడిటిని తమకు తోచిన రీతిలో, తెలిసిన తీరుగా నిర్వహిస్తుంటారు. యజ్ఞం, దానం, తపస్సు అనే మూడు కర్మలను ప్రతీ మానవుడు చేయాలి. అయితే కర్తకు ఉండే గుణాలను బట్టి అవి సత్త్వగుణం, రజోగుణం, తమోగుణానికి సంబంధించిన యజ్ఞదానతపో కర్మలుగా రూపొందుతాయి. అయితే, గీతలో భగవంతుడు చెప్పిన సందేశం, ఉపదేశం ప్రకారం ఆ కర్మలకు పూర్ణత్వం కలగాలంటే, అవి మనకు పూర్ణత్వాన్ని కలిగించాలంటే ‘ఓం తత్ సత్’ రూపంలో ఒనరించాలి.
భగవంతుని ప్రీత్యర్థమై యజ్ఞాచరణం, వేదమంత్ర పఠనం చేసే సమయంలో సంజ్ఞార్థకంగా ‘ఓం తత్ సత్’ ఉచ్ఛరిస్తారని శ్రీకృష్ణుడే తెలియజేశాడు. వీటిలో మొదటిది ‘ఓం’ కారం. శాస్త్ర విధులను బట్టి యజ్ఞం, దానం, తపస్సు చేసేవాడు ఆ కర్మలను ఓంకారనాదంతో ప్రారంభిస్తాడు. అప్పుడా కర్మలు పరమ పురుషుడిని పొందడానికి తోడ్పడుతాయి. ‘ఓం తత్ సత్’ అని పలకగానే కార్యపూర్ణత్వానికి నాంది పలికినట్లవుతుంది. వేద మంత్రాల్లో ప్రతి మంత్రానికీ ముందు ‘ఓం’ ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. ‘ఓం’కారం ద్వారా భగవత్ సన్నిధి అక్కడ సిద్ధిస్తుంది. ఇక ‘తత్’ అనడం ద్వారా కర్త తాను చేస్తున్న యజ్ఞం, దానాల ప్రయోజనం భగవంతుడి ప్రీతి కోసమే అని తెలియజేస్తాడు. ‘తత్’ అంటే పరతత్వం, పరబ్రహ్మం. ఆ కారణంగా కర్త తాను సంకల్పించిన కార్యం స్వీయ ఆధ్యాత్మికోన్నతికి, లోక కల్యాణానికి, సర్వజన సంక్షేమానికి ఉద్దేశించిందని ప్రకటించినట్టవుతుంది. లోక కల్యాణం కోసం చేసే కార్యాలు నిశ్చయంగా పరిపూర్ణమవుతాయి. వాటిని నిర్వహించిన కర్త కూడా పరిపూర్ణుడిగా అలరారుతాడు. ఇదే విషయాన్ని విశదీకరిస్తుంది ‘తత్’. ‘సత్’ అంటే నిత్యత్వమనీ, శాశ్వతమైనదనీ అర్థం. అది పరమ పురుషుని భావంలో ఉపయోగిస్తుంటారు. భగవంతుడు సత్, చిత్, ఆనంద విగ్రహుడు. అంటే.. నిత్యుడు, జ్ఞానమయుడు, ఆనందమయుడని భావం. భగవంతుని ప్రీతి కోసం చేసే కార్యం కాబట్టి ‘సత్’ అంటారు. ఇక్కడ కార్యమే కాదు, దాన్ని నిర్వర్తిస్తున్న కర్త కూడా ‘సత్’ స్వరూపమే!
ఇలా ‘ఓం తత్ సత్’ అంటూ కర్త తాను సంకల్పించిన కార్యాలను నిశ్చయంగా సఫలం, సంపూర్ణం చేయగలుగుతాడు. అంతేకాకుండా వాటిని భగవత్ ప్రీత్యర్థం చేయగలుగుతాడు. తాను సంకల్పించిన కార్యాలు ఏ విధంగా నిత్యమై నిలుస్తాయో, తాను కూడా అదేవిధంగా సత్ రూపంలో శాశ్వతుడు కాగలుగుతాడు. మంత్ర ప్రభావం, ఆ మంత్రాక్షరాల్లోని తత్వాన్ని గ్రహించగలిగితే సాధకుడు చేపట్టిన కార్యం, కార్యలక్ష్యం పరిపూర్ణత్వాన్ని సాధిస్తాయి. అందుకే, ధార్మికజనులు, సాధకులు భగవంతుని ప్రీత్యర్థమై సంకల్పించిన యజ్ఞదానతపోకర్మలను ‘ఓం తత్ సత్’ అని పలికి ప్రారంభిస్తుంటారు. కార్యాచరణ సమయంలోనూ ఈ మూడు సంజ్ఞార్థక పదాలను పదేపదే ఉచ్చరించాలి. తద్వారా కార్యసాఫల్యాన్ని సాధించడానికి చక్కని రంగాన్ని ఏర్పాటు చేసినట్లు అవుతుంది. ‘ఓం తత్ సత్’ ఉచ్ఛారణ ద్వారా సర్వ ఆధ్యాత్మిక విజయాన్ని సాధించవచ్చనే గీతా సందేశాన్ని అందరూ పాటించి పూర్ణలాభాన్ని పొందెదరు గాక! ఓం తత్ సత్!!
డా॥వైష్ణవాంఘ్రిసేవక దాస్
98219 14642