e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home చింతన రెండు చేతులతోనే చప్పట్లు!

రెండు చేతులతోనే చప్పట్లు!

‘ఏకం సత్‌-విప్రా బహుధా వదంతి’ అని సూక్తి. ‘పరబ్రహ్మం ఒకటే! పండితులు బహువిధాలుగా విశ్లేషిస్తారు’ అని భావం. ఒక్కటైన ఆ పరబ్రహ్మమే లోకంగా మార్పు చెందినప్పుడు అది రెండోది కాబట్టి లోకం అనేది రెండుతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు ఇంట్లో పైకప్పు, నేల రెండు. బయటకు వెళ్తే ఆకాశం, నేల మళ్లీ రెండు. వైద్యశాలకు వెళ్తే వైద్యుడు-రోగి, బడిలో గురువు-శిష్యుడు, గుడిలో దేవుడు-భక్తుడు ఇలా ఎన్నో సందర్భాల్లో, ఎన్నెన్నో స్థలాల్లో.. ఇది కనిపిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ విధంగా రెండింటితో అవినాభావ సంబంధం ఉంటుంది. ‘జీవో బ్రహ్మైవ నాపరః’ (జీవుడు బ్రహ్మమే-వేరుకాదు. ఇద్దరొకరే!) అనే సూక్తి లోతుల్లోకి వెళ్లడం ప్రస్తుతాంశం కాదు కానీ, లోకంలో మనం ఉన్నప్పుడు కింది విషయాలు నిర్దంద్వంగా అంగీకరించాలి.

గురువూ-శిష్యుడూ, వైద్యుడు-రోగీ ఎప్పుడూ ఒక్కటి కాలేరు. అలాగే తక్కినవీ! కానీ, వ్యవహారం మాత్రం ఒకటే! ఈ ఇద్దరూ లోకంలో ఎప్పుడూ ఒక్కటైపోరు. పోనవసరం లేదు. అది భావనలోనే సాధ్యం. వారిలోపల లోకం అనేది పూర్తిగా అదృశ్యమైతే వారొక్కరు అవుతారు. అలా జరిగినప్పుడు ఐహికంతో వారికి ఏ సంబంధం ఉండదు. అలాగని అందరూ అలాంటి ఉత్తమస్థితి పొందలేరు. తాను వేరు, నేను వేరు అనే భావనతో సాధన ప్రారంభించి అంచెలంచెలుగా ముందుకుసాగాలి. అలాంటి స్థితికి చేరుకోవడం అనుకున్నంత తేలిక కాదు.

- Advertisement -

ఆధ్యాత్మికతలో ఈ విషయాన్ని ప్రపంచ ప్రామాణిక గ్రంథం భగవద్గీత సవివరంగా తెలియజేసింది. ఇందులో ప్రధానంగా ఇద్దరు కనిపిస్తారు. ఒకరు కృష్ణుడు, మరొకరు అర్జునుడు. వీరిద్దరినీ ఎన్నో విధాలుగా విశ్లేషణ చేయవచ్చు. మనం అర్థం చేసుకునేదాన్ని బట్టి అది ఉంటుంది. ఉదాహరణకు కృష్ణుడు భగవంతుడు అర్జునుడు భక్తుడు. గోపాలుడు దేవుడైతే, పార్థుడు జీవుడు. నారాయణుడు గురువైతే, నరుడు శిష్యుడు, నంద నందనుడు అభయప్రదాత, కుంతీసుతుడు అభయ గ్రహీత, కృష్ణుడు శరణ్యుడు, అర్జునుడు శరణాగతుడు, కృష్ణుడు వక్త, అర్జునుడు శ్రోత ఇలా వీరిద్దరి మధ్యా వ్యత్యాసాన్ని వివరించవచ్చు. కానీ, భగవంతుడూ-భక్తుడూ, దేవుడూ-జీవుడూ, గురువు-శిష్యుడు, వక్తా-శ్రోతా ఒక్కటేనని, ఇద్దరి మధ్యా ఏ తేడా లేదని, ఇద్దరూ సమానమని చెప్తే సమంజసం కాదు. జీవుడే దేవుడు అనుకుంటూ యథార్థ స్థితిని విస్మరిస్తే మంచిదేనా కృష్ణార్జునుల చిత్తరువుల్లో ఎక్కడచూసినా కృష్ణుడు నిలబడే ఉంటాడు. అర్జునుడు పరమాత్మ పాదాల చెంత చేతులు జోడించి మోకరిల్లి కనిపిస్తాడు. అర్జునుడు మానసిక సంఘర్షణ నుంచి బయటపడేందుకు కృష్ణుని శరణువేడాడు. కృష్ణుడు.. అర్జునుని మనసులో నుంచి రోగకారక క్రిముల వంటి భావాలను వైద్యుడిలా తొలగించాడు. అంటే భక్తుడు.. భగవంతుడిని భజించవలసి ఉన్నది. జీవుడు.. దేవుడిని ప్రార్థించాలి. శిష్యుడు.. సద్గురువును ఆశ్రయించాలి. భయస్థుడు అభయప్రదాతను వెతుక్కోవాలి. శరణు వేడాలనుకున్నవాడు శరణ్యుడెవడో కనుక్కొని వాని సన్నిధికి చేరుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ, జీవుడూ, దేవుడూ ఒక్కటేనని కూర్చుంటే ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. రెండు చేతులూ కలిస్తేనే కదా చప్పట్లు! ముఖ్యంగా ఆధ్యాత్మికతలో ఇలాంటి వైఖరి వల్ల సాధన కుంటుపడుతుంది. దైవం సర్వోన్నతమనే భావనతో దేహీ అన్ననాడు.. పరమాత్మ అనుగ్రహం వర్షంలా కురిపిస్తాడు. ‘నేను’ అనే దేహబుద్ధి ఉన్నంతవరకు, ‘నేను సేవకుడు’, ‘అతడు ప్రభువు’ అనే దాస్య భావం కలిగి ఉండటం మంచిది’ అని రామకృష్ణ పరమహంస తన శిష్యుడు నరేంద్రునితో అన్నమాటలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి.

డా॥ వెలుదండ సత్యనారాయణ
94411 62863

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana