e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home చింతన అమృతాలోచనం

అమృతాలోచనం

ఆలోచన, విచారణ, చింతన అనేవి మనం సుమారుగా సమానార్థంలో వాడే పదాలు. జ్ఞానాన్ని, ధర్మాన్ని వెలిగించే ఈ ఆలోచన మనిషి విశిష్టత అన్నది రుషివాక్కు. ఆలోచన వికసించకపోతే మనిషి ఆటవికుడిగానే కొనసాగేవాడు. అదే ఆలోచన వికసిస్తే జీవితం అమృతమయం అవుతుంది. సమాజం స్వర్గంగా మారుతుంది. మదిలో మెదిలే ఆలోచన మెదడును తొలిచేలా ఉండకూడదు. మస్తిష్కం మన్నించేదై ఉండాలి. జీవితాన్ని తీర్చిదిద్దేదై ఉండాలి.

ఆలోచన వస్తు స్వరూప స్వభావాలను, కార్యకారణ సంబంధాలను, లాభనష్టాలను, నిత్యానిత్యాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే బౌద్ధికపుష్టి. ఈ తెలివి సరైనదిగా, సఫలమైనదిగా ఉండాలంటే ఆలోచనలో నిశితత్వం, నిష్పాక్షికత తప్పనిసరి. అప్పుడే అది సవ్యమైనది, సంతులితమైనది అవుతుంది. భౌతిక విషయపరమైన ఆలోచన పరిమాణాత్మకమైనది అయితే, అభౌతిక విషయపరమైన ఆలోచన గుణాత్మకమైనది. భౌతిక ఆలోచనలతో తీసుకునే నిర్ణయాల్లో అభిప్రాయ భేదానికి ఆధునిక విజ్ఞానశాస్త్రంలో అవకాశం తక్కువ. పరికరాలు, ప్రయోగాలు, పరీక్షల తర్వాత వెలువడే నిర్ణయాలు కావడంతో ఆక్షేపించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇందుకు మూల కారణం విశ్వాసం జ్ఞానాన్ని నిర్దేశించడమే! స్థూలంగా వస్తు స్వరూప స్వభావాలకు, కార్యకారణ సంబంధాలకు చెందిన ఆలోచన, అది అందించిన విజ్ఞానం మానవ జీవన విధానాన్ని, స్థాయిని, నాగరికతను రూపుదిద్దుతున్నది.

- Advertisement -

సమాజంలోని సంబంధాల విధానాలను, ప్రకృతితో మనిషి నెరపే సంబంధాల ను, ధర్మాన్ని, న్యాయాన్ని, మతవిశ్వాసాలను శిల్పించేవి సాంస్కృతిక మూల్యాలే. నిజానికి వివిధ సాంస్కృతిక మూల్యాలు చాలావరకు వివిధ మతపథాలతో సాన్నిహిత్యం కలిగి ఉన్నా వాటి ఫలాలు ప్రకృతి పరమైనవే! ఎవరు పాటిస్తే వారికి దక్కుతాయి తప్ప ఆ మతస్థులకు మాత్రమే దక్కుతాయని కాదు. ఆ మతాన్ని విశ్వసించే వారికి అవి సంప్రాప్తిస్తాయి. అయితే, ఒక సమాజాన్ని నడిపే సాంస్కృతిక మూల్యాలు సబలంగా, అవిరళంగా సాగాలని, గరిష్ఠ సత్ఫలితాలనివ్వాలని ధర్మ సంకరణాన్ని నిషేధిస్తుంది సంప్రదాయం. అందుకోసం విజ్ఞత, వివేచన అంతగా లేని సగటుమనిషి నిష్ఠ చెదరకుండా ఉండటానికి అది తప్పే అయినా ఇతర మార్గాలను తక్కువ చేసి చూపడం ఎప్పట్నుంచో జరుగుతూ ఉన్నదే. దురదృష్టవశాత్తు ఈ వికారం సమాజంలో మేధావులైన కొందరి తలలకు బాగా ఎక్కింది. దాని ఫలితంగా కొన్ని విపరీత ధోరణులు పురుడుపోసుకున్నాయి. వాటి కారణంగా పలు విభేదాలు, విద్వేషాలు, ఘర్షణలు తలెత్తుతూ ఉన్నాయి.

ఈ విద్వేషాలకు విరుగుడు నిత్యానిత్యతలను అర్థం చేసుకొనే సంతులితమైన నిశిత, నిష్పాక్షిక ఆలోచన. ఈ ఆలోచననే నిత్యానిత్య వస్తు వివేకమని, ఆత్మానాత్మ విచారణ అని, మిథ్యాదృష్టి నిరసనమని, పారమాత్మిక చింతనమని చెప్పారు మహోన్నత గురువులు. విశ్వజనీనంగా హితజీవనానికి ఏది గ్రహించ వలసిందో, ఏది వర్జించవలసిందో, సంకల్పబలంతో ఏది పాటించవలసిందో తెలిపేదే పరిణిత ఆలోచన. అదే అమృతాలోచనం. దీనివల్ల విద్వేషం తొలిగిపోతుంది. పారమాత్మిక అనన్యత్వం ప్రస్ఫుటం అవుతుంది. చివరకు ‘అహం బ్రహ్మాస్మి’అన్న భావన పరిమళిస్తుంది. వైవిధ్యం, స్వేచ్ఛ, విషయ భోగలాలస, అహంకారం, అపార వస్తుసంపద, పరివ్యాప్తమైన వ్యాపార ప్రచార సాధనాలు విస్తరిస్తున్న సందర్భంలో చోటుచేసుకొనే వికృతాల నుంచి విశ్వగురువులు ప్రసాదించిన అమృతాలోచనే మానవాళికి ఏకైక రక్ష, శ్రేయస్కర మార్గం.

యముగంటి ప్రభాకర్‌
9440152258

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement