e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home చింతన ఓమిత్యేకాక్షరం బ్రహ్మ!

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ!

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ!

ఆది ప్రణవ నాదమే ఓంకారం. అది సర్వజగతికీ మూలమైన నాద స్వరూపం. సృష్టికి పూర్వం జగత్తు అంతా గాఢాంధకారం (తమస్సు)లో మునిగి, కొన్ని యుగాలపాటు అలాగే ఉండిపోయిందట. చాలా కాలానికి మహత్తర ప్రకాశంతో పరబ్రహ్మ స్వరూపమైన ఆదిత్యుడు అంతరిక్షాన వెలసి, జగత్తును క్రమక్రమంగా తేజోమయం చేశాడు. ఆ మహోజ్వల కాంతి నుంచి వెలువడిన ‘అకార ఉకార మకార’ నాదమే ‘ఓంకార’మైంది. అనంతరం అదే ముల్లోకాలుగా ప్రభవించి, తర్వాత సప్తలోకాలుగా పరిణమించినట్లు ‘బ్రహ్మాండాది’ పురాణాలు పేర్కొన్నాయి. లోకమంతా చీకటిలో కూరుకొనిపోయిన వేళ అంతరిక్షంలో మహామౌనంలోంచి ఉద్భవించిన తొలినాదమే ‘ఓం’కారమని మన వేదర్షులు నాడే ప్రపంచానికి వెల్లడించారు. కాగా, ఇటీవల ‘నాసా’ అంతరిక్ష పరిశోధనల్లో సూర్యుని నుంచి వెలువడే నాదతరంగాలను రికార్డు చేసి విడుదల చేయడం ఒక విశేషం.

‘ఓం’కారమే పరమపదం. ‘ఓం’ అనే ఏకాక్షరమే పరబ్రహ్మ వాచకం. ప్రణవమే వేదఋక్కు రూపంలో అవ్యక్త మధురనాదంగా వెలువడింది. ‘మంత్రాణాం ప్రణవః’. మంత్రాలన్నింటిలోనూ శ్రేష్ఠమైంది ప్రణవమేనని శ్రీమద్భాగవతం (11-16-13) పేర్కొన్నది. ‘విశ్వంలోని శబ్దశక్తికి మూలాధారం ఓంకారం’ అన్నది ‘మాండూక్యోపనిషత్తు’. ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు కూడా ‘ప్రణవ శ్ఛందసామహమ్‌’, ‘ఛందస్సులలో ప్రణవ స్వరూపాన్ని నేనే’ అని ప్రకటించాడు. ఋగ్వేదం నుంచి అకారం, యజుర్వేదం నుంచి ఉకారం, సామవేదం నుంచి మకారం ఉద్భవించగా, ఈ మూడింటి సంయోగమే ‘ఓం’కారం అయిందంటారు. ‘తస్య వాచకః ప్రణవః’. ఆ పరమాత్మకు మరో పేరే ప్రణవం. నాదరూపమైన ‘ఓం’కారం దేవతాహ్వాన వాచకం. అంటే, దేవీదేవతలను ఎవరినైనా పూజలు, క్రతువులలోకి పిలవాలంటే ‘ఓం’కారం తోనే ఆహ్వానించాలి.

ఓం నమఃశ్శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం ఐం శ్రీం శ్రీమాత్రేనమః, ఓం శ్రీం మహా లక్ష్మై నమః.. ఇలా ప్రతీ దేవతా స్వరూపానికి ముందు ‘ఓం’ ఉండాల్సిందే. ‘భగవద్గీత’లో పరమాత్మకు ఓం, తత్‌, సత్‌ అని మూడు పేర్లున్నాయి. అవే బ్రహ్మజ్ఞానులకు, వేదాలకు, యజ్ఞాలకు మూలం. ‘ఓం’కార ఉచ్ఛారణతోనే వేదసారమంతా ఉచ్చరించినట్లవుతుంది. ‘ఓం తత్‌’ అంటే ఆ పరమాత్మ అని, ‘సత్‌’ అంటే సద్రూపమని (‘ఓం’కారమే పరమాత్మ సత్య స్వరూపం) తెలిసినవారు యజ్ఞం, దానం, తపస్సు మొదలైనవాటిని ‘ఓం’కారంతోనే ప్రారంభిస్తారు.

‘ఓం తత్సత్‌ పర బ్రహ్మార్పణమస్తు’ అని జపతపాదులను, పూజలను కూడా ముగిస్తారు. పారమార్థికమైన యజ్ఞయాగాది విషయాలకే కాకుండా శరీర పోషణ కోసం నిత్యం నిర్వహించే భోజనాన్ని కూడా ‘ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా’ అని ప్రాణాహుతులను (అన్నం మెతుకులను) ఉదరంలోని జఠరాగ్నిరూపంలో ఉన్న వైశ్వానరునికి సమర్పించడం మన సనాతన సంస్కృతిలో భాగమే.

‘ఇంద్రియాలను, మనసును స్వాధీనంలో ఉంచుకొని, యోగనిష్ఠతో ‘ఓం’కారాన్నే నిరంతరం ఉపాసిస్తూ ప్రాణాలు వదిలేవాడు అత్యుత్తమమైన మోక్షపదానికే చేరుకుంటాడని’ గీతాచార్యుడు అభయమిచ్చాడు. యోగానుష్ఠానపరులకు, సాధకులకు, పరివ్రాజకులకు మాత్రమే కాదు బ్రహ్మచారులకు, గృహస్థులకు, వానప్రస్థులకు కూడా ప్రణవమే సాధనం. స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా ప్రణవాన్ని ప్రతి నిత్యం జపించవచ్చు. జపతపాలకు, నిత్యానుష్ఠానానికి ప్రణవమే ఆధారం. ‘ఓం’కార పూర్వక ప్రాణాయామం కూడా ఒక పవిత్రమైన తపస్సే. మానసిక ఆరోగ్యం బాగుండాలన్నా, శరీరంపై నిత్య జీవితంలోని సంఘర్షణల ఒత్తిళ్లు తగ్గాలన్నా ‘ఓం’కారంతో ధ్యానం, ప్రాణాయామం చేయాలని ఆధునిక వైద్యులు, మానసిక తత్త్వవేత్తలు కూడా చెప్తున్నారు. ‘ఓమిత్యేకాక్షరం బ్రహ్మ’ అన్న వేదవాక్కులోని పరమార్థాన్ని గ్రహించి, దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవడానికి అందరం ప్రయత్నిద్దాం.

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ!
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ!

ట్రెండింగ్‌

Advertisement