ఓ ఆశ్రమంలో సత్సంగం జరుగుతున్నది. గాయకులు వినసొంపుగా పాటలు పాడుతున్నారు. ఆ పాటలకు తగ్గట్టు కొందరు నృత్యం చేస్తున్నారు. అక్కడే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి దిగులుగా ఒక మూలన కూర్చుని ఉన్నాడు. ఆ యువకుడిని చూసిన గురువు, అతని దగ్గరికి వెళ్లి నృత్య బృందంలో నువ్వు కూడా పాల్గొనవచ్చు కదా! అని అడిగాడు. ‘నా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నాకున్న సమస్యలు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండవు. నా జీవితంలో ఆనందమనేదే లేదు!’ అని బాధగా అన్నాడు. దానికి గురువు ‘ఓటీపీ అంటే నీకు తెలుసు కదా?’ అని అడిగాడు ‘అది అందరికీ తెలిసిందే! వన్ టైం పాస్వర్డ్’ అని బదులిచ్చాడు ఆ యువకుడు. ‘దాని కాల పరిమితి ఎంత?’ అని మళ్లీ ప్రశ్నించాడు గురువు. ‘కొన్ని సెకన్లు లేదా కొన్ని నిమిషాలు. ఆ కొద్ది సమయం గడిచిపోతే ఆ ఓటీపీ దేనికీ పనికి రాదు’ అని సమాధానమిచ్చాడు యువకుడు. ‘మన జీవితం కూడా అలాంటిదే.
ప్రకృతి మనకు ప్రసాదించిన కాలమే మన జీవితం. ఆ కాలపరిమితి దాటితే మనం ఉండం. జరిగిపోయిన కాలం, ప్రవహించే నది ఎప్పటికీ వెనక్కి రావని తెలిసిందే కదా! కాబట్టి మనకున్న కాలం ఎంతో అమూల్యమైనదిగా భావించాలి. ప్రతి క్షణమూ మనకు విలువైనదే. దాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే మనం ఆనందంగా ఉండాలి. ఎదురైన కష్టాలనే పట్టుకుని ఉంటే చెప్పా పెట్టకుండా కాలం గడిచిపోతుంది. అందుకే ఈ జీవితకాలపు ఓటీపీని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆనందం అనేది ఎక్కడినుంచో రాదు. మనలోంచే వస్తుంది. సేవ చేయడం, సకల జీవరాశుల పట్ల ప్రేమ, ప్రకృతితో అనుసంధానం కావడం, వర్తమానంలో జీవించడం లాంటివి చేస్తే ఆనందం మన వెంటే ఉంటుంది’ అని వివరించాడు గురువు. ఆ మాటల్లోని అంతరార్థం గ్రహించిన యువకుడు.. ఆనందంగా నృత్యబృందంలో చేరిపోయాడు.