సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ
తతో యుద్ధాయ యుజ్యస్వ నైనం పాపమవాప్స్యసి!
(భగవద్గీత 2-38)
నేనూ, నావారనే మోహంలో మునిగి అస్త్రసన్యాసం చేసిన అర్జునుడిని కర్తవ్యోన్ముఖుడిని చేసే ప్రక్రియలో భాగంగా కృష్ణపరమాత్మ.. ‘జయాపజయాలను, లాభనష్టాలను, సుఖదుఃఖాలను సమానంగా భావించి యుద్ధానికి సిద్ధమవ్వు.. అప్పుడు నీకు పాపాలు అంటవు’ అని పేర్కొన్నాడు.
వ్యక్తిత్వ వికాసానికి చక్కని మార్గదర్శనం చేసే శ్లోకం ఇది. కర్తవ్యాన్ని నిర్ణయించుకోవడంలోనే చేయాలా వద్దా.. అది లాభమా నష్టమా? ఆ పనిని చేయడం సుఖంగా ఉంటుందా.. ఇలాంటి సందిగ్ధత వెలుగుచూస్తుంది. అయితే అంచనాలతో పనిని ఆరంభించి.. ఆశించిన ఫలితం రాకపోతే బాధపడతాం. అలాగే జయాపజయాలు కూడా! ఆరంభిస్తేనే కదా ఫలితం వస్తుంది. మీనమేషాలు లెక్కిస్తూ కూర్చునే వానికి ఫలితాన్ని ఆస్వాదించే అవకాశమే లేదు.
సాధారణంగా మన జీవితం ఒక ఫుట్బాల్ లాంటిది. ఎవరో తంతారు.. ఎటో వెళ్తాము.. అక్కడ మరొకరు తంతారు.. మరొకచోటికి వెళ్తాము! పై అధికారి తిట్టవచ్చు.. వినియోగదారుడు నిరసించవచ్చు.. కుటుంబం ఈసడించవచ్చు. అర్హత ప్రాతిపదికగా మనకు రావలసిన పదోన్నతిని మరొకరు తన్నుకుపోవచ్చు.. భార్యాభర్తలు ఒకరినొకరు మోసం చేసుకోవచ్చు.. ఇవన్నీ మనకు కష్టాన్ని కలిగించే అంశాలే. ఒక పనిని చేసినప్పుడు అది సత్ఫలితాన్ని ఇస్తే సంతోషం కలుగుతుంది. లేనినాడు.. దుఃఖం మిగులుతుంది. దుఃఖం కలుగుతుందని పని చేయకపోవడం సమంజసమా? ఆకలేస్తే.. భోజనం వండుకోవాలి. వండటం బాధాకరమని మానేస్తే ఆకలి తీరేదెలా? బాధపడటం మనసుకు అలవాటైతే ప్రతి చిన్న కారణానికీ అది బాధపడుతుంది.
యోగం అంటే జతపరచడం. బుద్ధిని కర్మాచరణతో జతపరచడం యోగంగా చెబుతారు. అయితే పనిచేస్తున్న సమయంలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి. తప్పు జరుగుతుందని పనిచేయడం మానేయడం కన్నా.. బాధలను మౌనంగా భరించడమే ఉత్తమం. అనంతమైన శక్తి నిశ్శబ్దాన్ని ఆశ్రయించి అంతరంగంలో సుప్తావస్థలో నిక్షిప్తమై ఉంటుంది. దానిని జాగృతపరచాలి. నిశ్శబ్దం ఉన్నతమైన ఆలోచనలకు నెలవు. అది సమస్యలను పరిష్కరించడంలో భాగస్వామి అవుతుంది. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సహాయం చేస్తుందే కాని అహంకారాన్ని దరిచేరనీయదు. కాని మనలో చాలామంది ఆ అంతరంగంపై అహంకారం, మమకారంలాంటి ముసుగులను కప్పి, అంతరంగ శక్తిని వెలుగు చూడనీయకుండా బలహీనపరుస్తుంటారు. సాధించగలననే నమ్మకం.. అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. రామాయణంలో హనుమంతుడు నిబద్ధత, శ్రద్ధ, భక్తివిశ్వాసాలు అనే ఉపకరణాలతో తన ఆంతరంగిక శక్తి సామర్థ్యాలను జాగృతం చేసుకోగలిగాడు. అందుకే ఉదాత్తమైన రామకార్యాన్ని నిర్వహించగలిగాడు.
శత్రువును అనుసరించినప్పుడు మాత్రమే శత్రువును దెబ్బతీయడం సాధ్యపడుతుందని జూడో, కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్పుతాయి. జూడో అంటే శాంతత లేదా సౌమ్యత. కరాటే అంటే.. ‘ఖాళీ చేతులతో’ అని అర్థం. నిజానికి ఈ రెండూ ఆధ్యాత్మిక సాధనలో ఉపయుక్తమయ్యే ఉపకరణాలే! భౌతిక జీవితంలో కూడా వాటి ప్రాధాన్యాన్ని తగ్గించలేం. ఎప్పుడైతే నిత్య జీవితంలో సంఘర్షణలను నివారించుకుంటామో అప్పుడు అనంతమైన ప్రశాంతత మనసులో కొలువుదీరుతుంది. సహనంతో కూడిన ప్రశాంతత అన్ని సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తుంది.
ఒక ఈతగాడు సంద్రంలో ఈదుతూనే.. నీటిపై తేలియాడుతూ ఆనందాన్ని పొందుతుంటాడు. అలాగే జీవిత సముద్రంలో కూడా సమస్యల ఆటుపోట్లు తనను కుదిపివేస్తున్నా తేలియాడితూ.. ప్రశాంతతను పొందగలిగిన వ్యక్తిని పరిణతి సాధించినవాడిగా పరిగణించాలి. పాపమనేది సమస్య! అది మనల్ని బాధించకుండా ఉండాలంటే.. సుఖదుఃఖాలను సమంగా తీసుకునే సమాహిత చిత్తాన్ని సాధించే దిశలో సాధన చేయాలి.