ఎంత నడిచినా
వేగంగా పరిగెత్తినా
పట్నం
సాయంకాలానికి అలిసిపోదు
ఆవలింతలు తీయదు
పొద్దటికంటే కూడా
ఎక్కువ చైతన్యాన్ని పుంజుకుంటుంది
రోడ్లకు వాహనాల వరదొస్తుంది
ఆ ప్రవాహానికున్న రెండు తీరాలూ
ఇంద్రధనుస్సుల్లాంటి దీపాలతో
కాంతివంతమవుతాయి
పైన ఆకాశాన్ని చీకటి కప్పేస్తే
నగరం వెల్తురు పందిరవుతుంది
వెలుగూ వేగం రైలు పట్టాలవుతాయి
నేనేమో వలస పక్షిలా
పద్మవ్యూహాన్ని చీల్చుకుంటూ
తిరుగుముఖం పడతాను
ఠికానా చేరుతాను
ఎగిరే పక్షికి బాల్కనీలోని
పంజరం గూడు కానట్టే
నాకూ ఠికానా ఇల్లు కాదు
నగరమే ఓ పెద్ద ముసాఫిర్ ఖానా