మెతుకు సీమకు తలమానికం.. శతాబ్దానికి చేరువైన వైభవం .. మెదక్ పట్టణంలోని కెథడ్రల్ చర్చి. గోథిక్ శైలిలో నిర్మించిన ఈ రాతి కట్టడం ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా విరాజిల్లుతున్నది. ఈ ఏసుక్రీస్తు మందిరానికి ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులు తరలివస్తారు.
అది 1908వ సంవత్సరం… అప్పట్లో మెదక్ పరిసరాల్లో తీవ్రమైన కరువు నెలకొంది. పంటల్లేక, పనుల్లేక ప్రజలు ఆకలి దప్పులతో అలమటించారు. ఆ దుస్థితిని గమనించిన క్రైస్తవ మతగురువు చార్లెస్ వాకర్ ఫాస్నెట్ చరిత్రలో నిలిచిపోయే పనికి నాందిపలికారు. కరువు పీడితుల ఆకలి తీర్చే లక్ష్యంతో చర్చి కట్టాలని నిర్ణయించుకున్నారు. అలా 1910లో మొదలైన నిర్మాణం 1924 వరకు కొనసాగింది. అదే ఏడాది క్రిస్మస్ సందర్భంగా చర్చిలో తొలి ప్రార్థనలు జరిగాయి. చర్చి ప్రధాన గోపురం ఎత్తు 173 అడుగులు కాగా, పొడవు 200 అడుగులు, వెడల్పు 100 అడుగులు. రాయి, డంగుసున్నం ఉపయోగించి దీనిని ఎంతో పటిష్ఠంగా మలిచారు.
చర్చి ప్రధాన హాలులో ఏకకాలంలో ఐదువేల మంది ప్రార్థనలు చేసే వీలుంది. మందిరంలో గాజుముక్కలతో క్రీస్తు జీవిత చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలను పొందుపరిచిన తీరు అబ్బురపరుస్తుంది. బయటి నుంచి సూర్యకాంతి ప్రసరించినప్పుడు ఈ గాజుకుడ్యాలు క్రీస్తు జీవితాన్ని సాక్షాత్కరింపజేస్తాయి. నాణ్యమైన కలపతో తీర్చిదిద్దిన ఫర్నిచర్ నేటికీ చెక్కుచెదరలేదు. శాంతి, ప్రేమకు చిరునామాగా అలరారుతున్న క్రీస్తు మందిరం క్రిస్మస్ సందర్భంగా విద్యుత్ దీపాల వెలుగుల్లో మెరిసిపోతున్నది. ఈ అద్భుత నిర్మాణాన్ని చూసేందుకు మతాలకు అతీతంగా పర్యాటకులు మెదక్ పట్టణానికి తరలివస్తారు. ప్రభువు సన్నిధిలో ప్రశాంతంగా గడిపి సంతోషంగా తిరుగు ప్రయాణమవుతారు.