న కాంక్షే విజయం కృష్ణ! న చ రాజ్యం సుఖానిచ!
కింనో రాజ్యేన గోవింద! కిం భోగైర్జీవితేన వా?
(భగవద్గీత – 1- 32)
‘కృష్ణా! నాకు విజయంపై కోరికలేదు. ఓ! గోవిందా.. నాకు ఈ రాజ్యంతో గానీ, భోగాలతో గానీ, జీవితంతో గానీ ఏ విధమైన ప్రయోజనం లేదు!’ అంటూ కురుక్షేత్రంలో అర్జునుడు అస్త్రసన్యాసం చేశాడు. అది కురుక్షేత్రం. అంటేనే కార్యక్షేత్రం. అక్కడ కర్తవ్యాన్ని నిర్వహించాలే కానీ, సొంత భావనలకు అవకాశం ఉండదు. క్షత్రియుడిగా అర్జునుడి కర్తవ్యం ధర్మహాని జరుగుతున్న సమయంలో, అధర్మాన్ని నిగ్రహించి ధర్మాన్ని సంస్థాపించడం. నిర్దేశిత ధర్మాచరణకు సిద్ధమై కురుక్షేత్రానికి వచ్చిన అర్జునుడు.. ఇరుసైన్యాలలో తనవారిని చూసి, విమోహియై అస్త్రసన్యాసం చేస్తున్నాడు. కార్యాచరణవేళ సమర్థుడైన వ్యక్తి అస్త్రసన్యాసం చేయడం అవాంఛనీయం.
లక్ష్యం నిర్దేశితమైంది. వనరులు సమకూర్చుకున్నారు. యోజనా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఎవరి బాధ్యతలు వారికి అప్పగించడం జరిగింది. అర్జునుడి కార్య నిర్వహణా దక్షత, ధైర్య సాహసాలు, ప్రజ్ఞాపాటవాలు, గతంలో తాను సాధించిన విజయాలు ప్రాతిపదికగా.. అతణ్ని పూర్తిగా నమ్మి ఏడు అక్షౌహిణులతో పదకొండు అక్షౌహిణుల సైన్యాన్ని ఎదిరించడానికి రంగం సిద్ధమైంది. ఆ సమయంలో అర్జునుడు అస్త్రసన్యాసం చేశాడు.
ఇక్కడ కృష్ణా, గోవిందా అనే రెండు సంబోధనలు ముఖ్యమైనవి. ‘కృష్..’ అనేది భూవాచకం. భూమి ఫలితాన్నిస్తుంది. భూమి కృషికి, కర్తవ్యపాలనకు సంకేతం. ‘ణ’ కారం నివృత్తి మార్గం. ఫలితాపేక్షతో చేసే కృషి వల్ల మోక్షం రాదు. ఫలితాపేక్షలేకుండా ఎవరైతే కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వహిస్తారో వారికి మోక్షం వస్తుంది. ‘నేను చంపుతున్నాను’ అనే కర్తృత్వ భావన అర్జునుడిలో ఉంది.
గోవిందా అనడంలో… ‘గో’ శబ్దం ఇంద్రియాలకు ప్రతీక. ఇంద్రియాలను జయించిన వారికి శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేవాడు గోవిందుడు. ఇంద్రియాలను జయించడం అంటే ఇంద్రియాల పని విధానాన్ని అవగాహన చేసుకొని, వాటిని ప్రభావవంతంగా ఉపయోగించుకోవడం మాత్రమే. జీవితమనే మరొక పదం ఉన్నది ఇందులో. బతకడం వేరు, జీవించడం వేరు. జీవించడంలో ప్రయోజనం ఉంది. అర్థవంతమైన, ప్రయోజనకరమైన, ఆనందకరమైన, అభ్యుదయకారకమైనది జీవితం. సుఖభోగాలు రెండూ భౌతిక జీవితానికి సంబంధించినవే. ప్రలోభానికి గురిచేసేవే. రాజ్యమూ శాశ్వతం కాదు. ‘అశాశ్వత రాజ్యభోగాల కోసం, అయినవారిని అంతమొందించడం యుక్తమా?’ అని సంశయిస్తున్నాడు అర్జునుడు.
అర్జునుడు ఇప్పుడు తన సమర్థత కన్నా తక్కువ స్థాయి భావాలని ప్రదర్శించి అవే ఉదాత్తమైనవిగా భ్రమపడుతున్నాడు. తనకు యుద్ధాలు కొత్తనా? ఎన్నో యుద్ధాలలో పాల్గొని జైత్రయాత్రలు చేశాడు. ఆ యుద్ధాలలో ఎందరు చనిపోలేదు? పిరికివాడా.. అంటే కాలకేయ నివాత కవచాది రాక్షసులను నిగ్రహించాడు. ఇంద్రుని అర్ధ సింహాసనాన్ని అధిష్ఠించాడు. భౌతిక సంపదల పట్ల ఉదాసీనత మోక్షానికి అవసరమే! కానీ, అర్జునుడిలో ఇంకా అలాంటి మానసికస్థితి ఉత్పన్నం కాలేదు. అతని మనసు, బుద్ధి కలత చెంది ద్వైదీ భావనలతో సంక్షుభితమై అయోమయంలో ఉన్నాయి. కర్తవ్యంపై అసంతృప్తితో కూడిన వేదన కలిగింది. విభ్రమకు లోనైన మనసుతో తనది కారుణ్య భావన అనే ముసుగులో నిర్వికారతను ఆశ్రయించాడు. అర్జునుడు ధర్మ స్థాపనలో అనివార్యమైతే యుద్ధంలో ఎవరినైనా ఎదిరించాలే కానీ, క్లీబత్వాన్ని చూపకూడదనే జ్ఞానం లేనివాడా? అంటే కాదు. మరి ఎందుకా నిర్వేదన? మనసు చంచలమైనప్పుడు సందిగ్ధత పలకరిస్తుంది. ఆ సమయంలోనే మార్గదర్శకుడు అవసరమవుతాడు. వ్యక్తిలో సహజ స్థితియైన చేతన వెలుగు చూడాలి. దానికి ప్రేరణనిస్తూ వ్యక్తిని కర్తవ్యపరాయణుడిని చేసే దిశలో నడిపించేది భగవద్గీత.