ఊరే ప్రపంచంగా భావించే ఒక గ్రామీణ యువతికి పెళ్లి జరిగింది. రెండు గంటల ప్రయాణ దూరం ఉండే అత్తగారింటికి కాపురానికి వెళ్లే రోజు రానే వచ్చింది. అయినవాళ్లతో కలిసి బయలుదేరబోతూ ఉంటే అదే ఊర్లో ఉన్న తన అమ్మమ్మ గుర్తుకొచ్చింది. ఊరి చెరువు పక్కన ఉండే పొలం దగ్గర అమ్మమ్మ ఉందని తెలుసుకుంది. పరుగులు తీస్తూ అమ్మమ్మ ఉన్న పొలం దగ్గరికి చేరింది. అమ్మమ్మ కనకాంబరాల తోటలో పూలు కోస్తూ ఉంది. అమ్మమ్మ కాళ్లకి దండం పెట్టి ఏడుస్తూ ‘వెళ్లి వస్తానని’ చెప్పింది. ‘శుభమా అని అత్తగారింటికి వెళ్తున్నావు. ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటావ’ని అడిగింది అమ్మమ్మ. ‘నేను మన ఊరు దాటి ఎక్కడికీ వెళ్లలేదు. బావిలోని కప్పలాగా బతికాను. అత్తగారి బంధువులు, ఆ ఊరి వాళ్లు ఎలా ఉంటారో తెలియదు.
వారి మాటతీరు, అలవాట్లు, సంప్రదాయాలు అన్నీ నాకు కొత్త కదా! అందుకని ఆందోళనగా ఉంది’ అని భయంగా చెప్పింది. అమ్మమ్మ నవ్వి మనవరాలి చేతిలో కనకాంబరాలు పోసి ఆకాశంలోకి విసరమంది. అమ్మమ్మ ఎందుకు అలా చేయమన్నదో అర్థం కాలేదు ఆ యువతికి. ఏది చెప్పినా, ఏమి చేసినా అమ్మమ్మ మన మంచికోసమే కదా చెబుతుందని అలాగే చేసింది. పైకి విసిరిన పూలు క్షణాల్లో వారిపైన పలపలా కిందరాలాయి. అమ్మమ్మ అక్కడే ఉన్న రేగు చెట్ల నుంచి రేగు పండ్లు కోసి మనవరాలి చేతికి ఇచ్చి పైకి విసరమంది. అమ్మమ్మ చెప్పినట్లే రేగు పండ్లను కూడా ఆ యువతి విసిరింది.
కొద్ది క్షణాల్లోనే రేగు పండ్లు వారి నెత్తినపడ్డాయి. నేల మీద పడిన రేగు పండ్లను ఏరి మనవరాలి చేతికి ఇస్తూ ‘మనం ఏది పైకి విసిరామో అదే మన మీద పడుతుంది. పూలు విసిరితే పూలు, పండ్లు విసిరితే పండ్లు మన మీద పడ్డాయి. అలాగే నువ్వు మీ అత్తగారి ఊరి మనుషులతో సఖ్యతగా ఉండు. మంచిగా మాట్లాడు. మంచిని పంచు. అప్పుడు నీకు, నీ కుటుంబానికి సుఖ సంతోషాలు కలుగుతాయి’ అని చెప్పింది అమ్మమ్మ. ఆమెకు ప్రణమిల్లి ‘నోరు మంచిదైతే ఊరు మంచిదని పెద్దవాళ్లు చెప్పింది’ గుర్తుకు తెచ్చుకుని అక్కడినుంచి బయలుదేరింది కొత్త పెళ్లి కూతురు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు, 93936 62821