మనం కృతజ్ఞత చూపడం వల్ల దేవుడికి వచ్చే లాభం ఏమీ లేదు. కానీ, అలా చేయడం వల్ల మన జీవితాలే ధన్యమవుతాయి. ‘మీరు నాకు కృతజ్ఞత చూపితే, నేను మీపై నా అనుగ్రహాలను మరింతగా కురిపిస్తాను’ అని అల్లాహ్ పేర్కొన్నారు. అంతేకాదు, నిరంతరం స్తుతించే దాసుల కోసం స్వర్గలోకంలో అల్లాహ్ ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మిస్తారు. దాని పేరే ‘బైతుల్ హమ్ద్’ (స్తోత్ర గృహం). కృతజ్ఞత లేని హృదయం ఎడారి లాంటిది, అది దైవానికి దూరం చేస్తుంది.
కృతఘ్నత అనేది కేవలం పొరపాటు కాదు, అది ఆత్మ చేసే అతిపెద్ద పాపం. మిత్రమా! మనకు లభించిన ఈ చిన్న జీవితంలో ఫిర్యాదులు చేయడం మానేద్దాం. ఉన్నదానికి తృప్తి చెందుతూ, లేనిదాని కోసం ఆ దైవంపై నమ్మకం ఉంచుదాం. ప్రతి ఉదయం నిద్రలేవగానే ‘నన్ను ఇంతగా ప్రేమిస్తున్న నా దైవానికి నేను ఈ రోజు ఎలా కృతజ్ఞత తెలుపుకోవాలి?’ అని ప్రశ్నించుకుందాం. కృతజ్ఞతే మన శ్వాస కావాలి.. ఆరాధనే మన ఆశ కావాలి.