బుధవారం 03 మార్చి 2021
Devotional - Feb 23, 2021 , 02:45:07

సాకారోపాసనా శ్రేయస్కరమే!

సాకారోపాసనా శ్రేయస్కరమే!

క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసామ్‌

అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే॥

 -శ్రీమద్భగవద్గీత (12-5)

అవసరాన్నిబట్టి ‘పరబ్రహ్మం’ సాకారుడుగానో, నిరాకారుడుగానో ప్రవర్తిస్తూ మానవాళిని సర్వకాల సర్వావస్థలలోను సంరక్షిస్తూ వుంటుంది. నిర్గుణ పరబ్రహ్మంలో ఆసక్తి గలవారైన చాలామందికి ‘దేహాభిమానం విడిచి పెట్టడం’ చాలా కష్టతరం. ఆ విధమైన బ్రహ్మోపాసన సామాన్యులకు దుస్సాధ్యం. అయితే, ‘నిర్గుణ బ్రహ్మోపాసన’ తప్పనిసరి అనిగాని, మిగతా ఏ దారులూ లేవనిగాని, అవన్నీ తప్పనిగాని ఎక్కడా లేదు. ‘శ్రీమద్భగవద్గీత’లో శ్రీకృష్ణుడు ‘సమస్త కర్మలూ ఈశ్వరార్పణం చేయమని’ అన్నాడు. అంటే, మనం రోజూ చేసే పనులన్నింటినీ దేవుని పూజలుగానే భావించి, ‘ఇవి నీకే సమర్పణం’ అని అప్పజెప్పాలన్నమాట. ‘ఒకవేళ చిత్తాన్ని నాపై నిలుప లేకపోతే విగ్రహాది (సాకార) రూపాలను ఆలంబనం చేసుకొని, నన్ను పొందడానికి మళ్లీ మళ్లీ ప్రయత్నించవచ్చు’ అనే మినహాయింపునూ ఇచ్చాడు.

అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్‌

అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ॥ (12-9)

లోక కంటకులను సంహరించి లోకాలను రక్షించిందల్లా సాకార పరబ్రహ్మమే. ‘సాకారంలో దిగి రావయ్యా స్వామీ! నిరాకారంగా వుండిపోతే ఎలా? సాకారమైనప్పటికీ పాల సముద్రంలో శేషశయ్యపై పవళిస్తే సరిపోతుందా? ఆకారం ధరించి భూలోకంలోకి దిగిరా. మనుషులతోసహా నిన్ను నమ్ముకున్న వాళ్లంతా నిన్ను చేరుకోవడానికి ఎంతగానో కష్ట పడుతున్నారు’ అని దేవతలు మొర పెట్టుకుంటేనే, ఆయన (విష్ణుమూర్తి) రామ-కృష్ణాది అవతారాలు దాల్చాడు. అనాదిగా సంసార సముద్రంలో చిక్కుకొన్న ఆర్తులను రక్షించిందీ, తక్షణ పరిష్కారం చూపించిందీ సాకారులైన దేవతలే.

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్‌

ధర్మసంస్థా పనార్థాయ సంభవామి యుగేయుగే॥ (4-8)

నిరాకారంలో ఆలంబనం దొరకదు. సాకారంలో దొరుకుతుంది. నిరాకారంగా వున్న తనను చేరుకోలేరనే భావనతోనే కరుణా సముద్రుడైన పరబ్రహ్మం వివిధ రూపాలలో సాకారుడై దిగి వస్తున్నాడు. అంటే, మన అందుబాటులోకి వస్తున్నాడు. మనం దారి తప్పకుండా జాగ్రత్త పడుతున్నాడు. అంతేకాదు, ‘సాధుజనులను రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి, ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి నేను ప్రతి యుగంలోనూ పుడుతూనే ఉంటాను’ అని హామీకూడా ఇచ్చాడు. సాకారం కంటే గొప్పది వున్నదనుకొంటూ, దానివద్దకు చేరుకోవడానికి దారేదో తెలియక, మనస్సు నిలుప లేక, వృథా కాలక్షేపం చేసేకంటే ‘సాకారుడై దిగి వచ్చినవాడూ నిరాకారుడే’ అన్న విషయాన్ని ముందుగా గమనించి, అర్థం చేసుకొని, విశ్వసించి, శరణు పొంది, తరించడమే తక్షణ కర్తవ్యం. 

హరేర్నామ హరేర్నామ హర్రేర్నామైవ కేవలం

కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతి రన్యథా॥

‘హరినామమే, హరినామమే కేవలం హరినామమే! కలియుగంలో వేరే గతి లేదు, లేదు, లేదు!’ అని ‘బృహన్నారదీయ పురాణం’ ఘోషిస్తున్నది. ఇది సులభ తరుణోపాయం. ఎవరికైనా ‘హరినామం నచ్చకపోతే రామ, కృష్ణ, శివ, ఆంజనేయ, దుర్గాది నామాలలో ఏదైనా సరే!’ అని భావించినా అనుచితమేమీ ఉండదు. అనంత కాల ప్రవాహంలో తక్కిన యుగాల సంగతి వేరేగా ఉన్నది. సత్య (కృత), త్రేతా, ద్వాపర యుగాలలోని మానవులు అత్యంత దృఢకాయు లు, అమిత బలసంపన్నులు, కఠిన సాధనలు చేయడానికి సర్వసమర్థులు, దీర్ఘాయురారోగ్య భాగ్యాలు కలవారు. కానీ, కలియుగంలోని వారు మాత్రం ‘అలసలు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు’ అని ‘భాగవతం’ పేర్కొన్నది. అందుకని, ‘సులభ తరుణోపాయం అవలంబించడం పొరపాటేమీ కాదు’ అని గ్రహించాలి. సాకారప్రియులు ఎలాగూ ఈ విధానాన్నే ఆశ్రయిస్తారు. ప్రత్యేకించి, ‘నిరాకారమే ఉపాసించదగిందని నమ్మేవారు’ మాత్రం దీనిని తెలుసుకోవాలి.

డాక్టర్‌ వెలుదండ

 సత్యనారాయణ

94411 62863

VIDEOS

logo