శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Jul 26, 2020 , 23:30:50

ఆత్మ జ్ఞానమే సర్వోన్నతం!

ఆత్మ జ్ఞానమే సర్వోన్నతం!

యత్‌ తదద్రేశ్యమ్‌ అగ్రాహ్యమ్‌ అగోత్రం అవర్ణమ్‌

అచక్షుః శ్రోత్రం తదపాణిపాదమ్‌

నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం

తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః॥

అంగిరస మహర్షి ‘ముండకోపనిషత్తు’ను శౌనకునికి బోధించాడు. ‘వేదవేదాంతాలూ సామాన్య శాస్ర్తాలేనని, ఆత్మజ్ఞాన మొక్కటే ఉత్కృష్టమైన జ్ఞాన’మని చెపుతూ, భగవంతుడు అనబడే ఆత్మ లక్షణాలను వర్ణించాడు. ఆత్మను దర్శింప సాధ్యం కాదు. అర్థం చేసుకోవడానికి కూడా సాధ్యం కాదు. జన్మ లేనిది, రంగు లేనిది, కళ్లు-చెవులు, కాళ్లు-చేతులు లేనిది, శాశ్వతమైంది, అన్ని రూపాలనూ సంతరించుకొని అంతటా వ్యాపించింది. అత్యంత సూక్ష్మమైంది, తరుగు లేనిదీ, సృష్టికి మూలమైన ఆత్మను జ్ఞానులు మాత్రమే అంతటా చూడగలరని చెప్పాడు. ఇంతటి అర్థవంతమైన తీరుగా ఆత్మ లక్షణాలను చెప్పిన శ్లోకాలు చాలానే ఉన్నా, ఈ శ్లోకం ప్రత్యేకత, ఉత్కృష్టత మరో దానికి లేదంటే అతిశయోక్తి కాదు. 

ఆత్మను చూడటం సాధ్యం కాదు. సాధకుడిని మొదలుకొని, కోటానుకోట్ల పార్సెక్‌ల వ్యాప్తినికూడా తనలో ఒకానొక సూక్ష్మభాగంగా చేసుకున్న ఆత్మను, కేవలం కొన్ని కిలోమీటర్ల దూరాన్ని చూడగలిగిన కండ్లతో వీక్షించలేమన్నది తిరుగులేని నిజం. దానిని అర్థం చేసుకోవడమూ సాధ్యం కాదు. ‘జీవం’ అనేది పంచభూతాల మేలిమి కలయిక. దీనిలో దేని పాలు ఎంతో అర్థం కాదు. ఏయే అనుకూల పరిస్థితుల్లో ఈ అద్భుత కలయిక జరుగుతుందో కూడా చెప్పలేం. ఈ గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు, వాటి గమనం, వేగం, సృష్టి, స్థితి, లయలు ఎందుకు జరుగుతున్నాయో, దాని అంతిమ లక్ష్యం ఏమిటో అర్థం కాదు. అవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి వందల తరాలు మానవుడు, వేల ఏండ్ల కాలమూ ఆత్మలో లయమైపోయాయి. అందుకే, ‘జీవించి ఉండగానే ఆత్మజ్ఞానంతో ఆత్మలో లయమై మోక్షస్థితిని అనుభవించ’మని ఉపనిషత్తులు అంటాయి. దానినే అంతిమ లక్ష్యంగా పేర్కొంటాయి.

ఆత్మకు పుట్టుకే లేదు. ‘శక్తి నిత్యత్వ నియమం’ చెప్పేది ఇదే కదా! శక్తి పుట్టలేదు, మరణించనూ లేదు. కానీ, ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారగలదు. ఇంకేం, అనంత శక్తే అన్ని విభూతుల రూపాలలోకి మారుతున్నది. తిరిగి అన్నిటినీ తన రూపంలోకి మార్చుకుంటుంది. ‘యదృశ్యతి తన్నశ్యతి’ అన్నట్లుగా కనిపించేవన్నీ నశించాయని మనం ఒకసారి ఊహించుకుందాం. ప్రకృతి, భూమి, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, కాంతి, శబ్దం అన్నీ మాయమై పోయాయనుకొని చూస్తే అంతా చిమ్మ చీకటి వ్యాపించి ఉంటుంది. నల్లనైన ఆత్మ ఒక్కటే ఉంటుంది. సైన్స్‌ ప్రకారం నలుపు రంగు కాదు. అన్నిటినీ, చివరకు కాంతినికూడా మింగేసేదే అవర్ణం. ఆత్మకు అంగాలు లేవు. అసలు, ఆకృతే లేదు. కాబట్టి, నిశ్చలంగా ఉన్నది. 

అన్నింటినీ స్థాపిస్తున్నది, ఈ దృశ్యమాన ప్రపంచంలోని విభూతులన్నింటికీ మాతృక ఆత్మే. ఆత్మనుండి సూర్యుడు, సూర్యునినుండి పంచభూతాలు, వాటినుండి జీవం, దానినుండి మనం ఉత్పన్నమయ్యాం. ఈ సృష్టి, స్థితి, లయలు ఆత్మ ఆచరించే నిరంతర, అనివార్య కర్మలు. అదే ఆత్మ అన్ని విభూతుల లోలోతులలోకి చొచ్చుకొనిపోయి అత్యంత సూక్ష్మరూపంలో నిశ్చలంగా ఉంటున్నది. ఎన్నటికీ తరుగు లేనిదీ ఆత్మ. ఎన్ని ఖగోళాలు పుట్టినా, ఎన్ని నక్షత్ర మండలాలు రూపొందినా, ఎన్ని జీవాలు జన్మించినా ఆ ఆత్మ ఇసుమంత కూడా తరిగిపోదు. ఎందుకంటే, ఆ ఆత్మలోనే ఈ రూపాలన్నీ ఉనికిలోకి వస్తున్నాయి. వాటి ఆవలా, ఉనికి లోపల అంతరాలలో ఆత్మే నిక్షిప్తమై వుంటుంది. ఆత్మ అజాతమై, అనంతమై, అజాండమై, అద్భుతమై, అచోద్యమై, అజరామరమై విలసిల్లుతున్నది. అదే సతతమై సదా వెలుగొందుతూ ఉండిపోతుంది.logo