శనివారం 08 ఆగస్టు 2020
Devotional - Jun 09, 2020 , 00:28:54

నమామి శశినం సోమం!

నమామి శశినం సోమం!

దధి శంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం

నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం॥

ఇది నవగ్రహ స్తోత్రంలోని చంద్ర స్తుతి. గడ్డ పెరుగు వలె, శంఖం వలె, పొద్దుటే గడ్డిమీద పరచుకొన్న మంచుముత్యాల వలె ప్రకాశిస్తాడట చంద్రుడు. వేదమంత్రాల నుండి స్తోత్ర సముదాయం వరకు, ప్రాచీన భారత సాహిత్యమంతా కవితామయమే. చంద్రుని ప్రకాశం చల్లగా, తెల్లగా వుంటుంది. కాని, మరీ తెల్లని తెలుపు కాదు. అందుకే, ఈ పోలికలు. తుషార బిందువులతో ఉదయభానుని కిరణాలు ప్రతిఫలించి నప్పుడుండే ప్రకాశమన్నమాట అది.

‘గ్రహాలు సూర్యశకలాలని, ఉపగ్రహాలు ఏయే గ్రహాల చుట్టూ తిరుగుతున్నవో ఆయా గ్రహాలకవి శకలాలని’ ఆధునిక విజ్ఞానం బోధిస్తున్నది. ‘చంద్రుడు క్షీర సముద్రా న్నుండి పుట్టినాడని’ మొదట పేర్కొన్న శ్లోకం చెప్తున్నది. మన ప్రాచీనులు సప్తసముద్రాల (లవణ సముద్రం, ఇక్షు సముద్రం, సుర లేదా మద్యం సముద్రం, ఘృత సముద్రం, దధి సముద్రం, క్షీర సముద్రం, శుద్ధోదక సముద్రం)ను ఉటంకించారు. మనకు తెలిసిన హిందూమహా సముద్రం వంటిన్నీ లవణ (ఉప్పునీటి) సముద్రాలే. సముద్రాలను పోలిన మంచినీటి సరస్సులను ‘శుద్ధోదక సముద్రాలు’గా భావించవచ్చు. రాత్రిళ్లు ఆకాశంలో తెల్లని మార్గం వలె కనిపించేదే మన మిల్కీ వే. ‘క్షీరార్ణవ’మన్నది పాలపుంతకు చెందిన ప్రాచీన నామం. ‘చంద్రుడు భూమినుండి విడివడిన పదార్థం కాదు. క్షీర సముద్రం నుండి సౌరకుటుంబంలోకి చొచ్చుకు వచ్చి, భూమికి ఉపగ్రహంగా మారిన వేరొక నక్షత్ర శకలం’ అని మన పూర్వులు చెబుతున్నారు.

‘ఈ భూమిపైన నీటి పుట్టుక ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది?’ అన్నది శాస్త్రజ్ఞులను చాలాకాలంగా వేధిస్తున్న సమస్య. సౌర కుటుంబ వ్యవస్థలోని పదార్థాల (గ్రహాలు)న్నీ పొడి బారినవే. తడికి తావులేదు. ఒక్క భూమిమీద మాత్రమే నీరున్నది. ఒకానొక నక్షత్ర శకలం వేగంగా వచ్చి భూమిని గుద్దుకొని దూరంగా ఎగిరిపడి భూమిచుట్టూ తిరగడం మొదలుపెట్టింది. ఆ నక్షత్ర శకలమే చంద్రుడు. శాస్త్రజ్ఙులు ఆ శక లానికి ‘థియా’ అని పేరు పెట్టారు. ‘థియా’ గుద్దుకున్నందున భూమికి పెద్ద సొట్ట పడింది. ఆ సొట్టనే మనమిప్పుడు ‘శాంతి(పసిఫిక్‌) మహాసముద్ర’మని పిలుస్తున్నాం. ‘థియా’ తనతోపాటుగా నీటిని ఏర్పరిచే సామర్థ్యం కలిగిన కర్బన పదార్థాలను భూమిపైకి మోసుకొచ్చింది. ‘థియా’ సౌరకుటుంబానికి చెందిన శకలమైతే భూమిపైన నీరు ఏర్పడే అవకాశం లేదు’ ఇలా కొత్తగా ఆలోచించాల నుకున్నారా శాస్త్రజ్ఞులు.

అప్పుడు వారి మదిలో మెదిలిన ఆలోచన ‘థియా’. అది సౌర కుటుంబం బయటినుండి వచ్చి సౌరకుటుంబంలో స్థానం పొందిన నక్షత్ర శకలం. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ ప్రొఫెసర్‌ థార్‌స్టన్‌ క్లీన్‌, గెర్రిట్‌ బడ్డ్‌, క్రిస్టోఫ్‌ బుర్థాడ్ట్‌ అన్న జర్మన్‌ శాస్త్రజ్ఞులు రచించిన వ్యాసాన్ని ‘నేచర్‌ అస్ట్రానమీ’ పత్రిక గతేడాది ప్రచు రించింది. ఐతే, ‘చంద్రుని జన్మస్థలం పాల సముద్రం’ అన్న మన ప్రాచీనుల ఆలోచ నలను ఆధునిక శాస్త్రజ్ఞులు ఈ రకంగా పరోక్షంగా సమర్థించి నట్టు అర్థం చేసు కోవాలి. చంద్రుని ప్రకా శాన్ని తుషారంతో పోల్చడానికి కారణం చంద్రునివల్లనే భూమి పైన నీరు అవత రించిందన్న సత్యాన్ని ఆవిష్కరించడానికి కూడ కావచ్చు.

‘శశి’ అంటే ‘కుందేలు’. చంద్రబింబంపైన కుందేలు ఆకారం కనబడుతున్న కారణంగా చంద్రుడిని శశిధరుడని పిలుస్తున్నాం. ఈ కుందేలును కొందరు మృగంగా దర్శించారు. మృగ(జింక) చిహ్నం కలవాడు కాబట్టి, చంద్రుడు మృగాంకుడైనాడు. చంద్రునికి ‘సోముడు’ అనికూడా పేరున్నది. ‘సూతే అమృత మితి సోమః షూ ప్రాణి ప్రసవే’- ‘అమృతాన్ని పుట్టించినవాడు కనుక సోముడు’ అంటున్నది అమరకోశం. క్షీర సాగర మథనంలో చంద్రుడు పుట్టినాకనే అమృతం వచ్చింది కనుక అమృతాన్ని పుట్టిం చిన వాడైనాడు. భూమిమీద జీవరాశి ఏర్పడ టానికి కారణం నీరు. భూమిపైన నీటి బిందు వులంటూ ఏర్పడటానికి కారణం చంద్రుడు. చంద్రుని కారణంగానే మన మంతా పుట్టి వున్నాం. నేను ఈ నాలుగు వాక్యాలను రాయగిలిగాను. మీరు చదువ గలుగు తున్నారు. అటువంటి చంద్రునికి సాష్టాంగ ప్రణామం ఆచరించడం సమంజసం!


logo