పరమేశ్వరుడే ఈ ప్రపంచాన్ని సృష్టించి, రక్షించి, నశింపజేస్తాడు. సృష్టి స్థితి లయలు ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటాయి. సృష్టి ఏర్పడటానికి ముందు ముఖ్యంగా మూడు తత్త్వాలున్నాయి. పరమేశ్వర తత్త్వం, జీవాత్మ తత్తం, ప్రకృతి తత్త్వం. ఈ మూడు తత్త్వాల వ్యవహారం విలక్షణమైంది. నిజానికి సృష్టిరచనకు పూర్వం పరమేశ్వరుడు ఉన్నాడు. జీవాత్మలు ఉన్నాయి. కానీ, ప్రకృతికి సంబంధించిన వ్యవహారం లేదు. ఎప్పుడైతే ప్రపంచమనే కార్యజగత్తు ఏర్పడిందో అప్పుడే ‘ప్రకృతి’ ఒకటి కారణ రూపంలో ఉందని తెలుసుకునే అవకాశం ఏర్పడింది.
సత్త్వ గుణం, రజో గుణం, తమో గుణాల సామ్యావస్థకే ‘ప్రకృతి’ అని పేరు. ఇది పాంచభౌతికమైన ప్రపంచానికి ఉపాదాన కారణం. దేని నుంచి మరొక తత్త్వం పుడుతుందో దానికే ప్రకృతి అని పేరు. పిల్లలు కలిగిన తర్వాత తల్లిదండ్రులు అన్న పేర్లు ఏర్పడతాయి. అలాగే కార్యరూప జగత్తు ఏర్పడిన తర్వాతే కారణరూప ప్రకృతికి గుర్తింపు. సృష్టికి ముందు పరమాణువుల వ్యవహారం కూడా లేదు. అణువులు ఏర్పడిన తర్వాతే పరమాణువుల వ్యవహారం వచ్చింది. పై ఉదాహరణల ఆధారంగా చూస్తే సృష్టి ఏర్పడిన తర్వాత సృష్టికర్త పరమేశ్వరుడని, జీవాత్మలు శరీరధారులని, ప్రకృతి జడ ప్రపంచానికి ఉపాదాన కారణమని తెలుస్తుంది. పాంచభౌతికమైన ప్రపంచాన్ని విరాట్ పురుషుడుగా అభివర్ణించారు. అందుకే, సృష్టికి ముందు ‘విరాట్టు’ను పేర్కొంటారు. సంపూర్ణ సృష్టికి ఈ విరాట్టే ఆధారం. ‘విరాట్టు’ శబ్దానికి అన్ని శరీరాలకు చెందిన సమష్టి దేహమని అర్థం. ఒక విధంగా ఈ కనిపించే బ్రహ్మాండమే దీని శరీరం- సూర్యచంద్రులు నేత్రాలు, గాలి ప్రాణం, భూమి పాదాలు.
సృష్టి ఏర్పడటానికి ముందు, పరమేశ్వరుడితోపాటు అతనికంటే భిన్నమైన తత్త్వం ఒకటి ఉంది. అదే స్థూలజగత్తుకు మూల కారణం. దాన్నే వేదం పరమేశ్వరుడి సంపత్తిగా అభివర్ణిస్తుంది. అట్లా ఏర్పడటానికి కారణం పరమేశ్వరుడే! కాబట్టి సృష్టికి పూర్వం పరమేశ్వరుడే కాక, అతని కంటే భిన్నమైన ప్రకృతి ‘సంపత్తి’ రూపంలో ఉందని గ్రహించాలి. ఈ వర్తమాన జగత్తు పరమేశ్వరుడి ముందు అల్పమైంది. అనంతమైన, గొప్పదైన, సర్వవ్యాపకమైన పరమేశ్వర తత్త్వాన్ని ఈ జగత్తు ఏమాత్రం కప్పజాలదు. అది పరమేశ్వరుడితో సమానమైంది గాని, మించింది గాని కానే కాదు.
హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్
సదాధార పృథివీం ద్యాముతేమాం కస్మై దేవాయ హవిషా విధేమ॥
(రుగ్వేదం)
సృష్టి కంటే పూర్వం పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు. అతనే సమస్త ప్రాణి కోటికి స్వామి. భూమి మొదలు సూర్యుడి వరకు గల సమస్త లోకాలను అతనే ధరించి ఉన్నాడు. అందువల్ల అతనిని ఉపాసించాలని రుగ్వేదం చెబుతుంది. పరమేశ్వరుడే త్రికాలలో జగద్రచన చేస్తాడని, అతనే మోక్ష ప్రదాత, సర్వశక్తిమంతుడని, అతనికి జనన మరణాలు లేవని, శాశ్వతుడని, అనాది అని యజుర్వేదం ప్రబోధిస్తుంది. పరమేశ్వరుడి మహిమ అపారమైంది. విశ్వం అతనిలో ఒక అంశ మాత్రమే. పరమేశ్వరుడు జగత్తుకంటే మూడింతలెక్కువ!
పరమేశ్వరుని సంకల్పం వల్లనే జీవాత్మలు దేహధారులయ్యారు. సమస్త భోజన పదార్థాలు ఉత్పన్నం అయ్యాయి. పంచభూతాలను సృష్టించినవాడు పరమేశ్వరుడే. మొదట భూమిని కల్పించడానికి జల సారాంశాన్ని గ్రహించి భూజల పరమాణువులతో భూమిని రచించాడు. అగ్ని సారాంశాన్ని గ్రహించి అగ్ని పరమాణువులతో జల పరమాణులను చేర్చి నీటిని పుట్టించాడు. వాయుసారాంశాన్ని గ్రహించి వాయు పరమాణువులతో అగ్ని పరమాణువులను చేర్చి నిప్పు పుట్టించాడు. వాయు పరమాణువుల వల్ల గాలిని, ప్రకృతి ఆధారంగా ఆకాశాన్ని రచించాడు. సర్వపదార్థాలను, ప్రపంచాన్ని రచించడం వల్ల పరమేశ్వరుడికి విశ్వకర్మ అనే పేరు సిద్ధించింది. గాయత్రీ మంత్రంలోని ‘సవిత’ శబ్దం పరమేశ్వరుడు సృష్టికర్త అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ‘నేను గొప్పవాణ్ని’ అని అనుకున్న తర్వాతనే ఆ పరమేశ్వరుడి సంకల్ప బలం వల్ల సృష్టి రచన జరిగినట్టు బృహదారణ్యకోపనిషత్తు తెలియజేస్తున్నది.
ఆచార్య మసన చెన్నప్ప
98856 54381