Suicide | చిన్నశంకరంపేట, మార్చి 14 : జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని మడూరులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మండల పరిధిలోని మడూర్ గ్రామానికి చెందిన పిరంగళ్ళ శివరాజ్(24) తనకు పెళ్ళి సంబంధాలు కుదరడం లేదని తనకంటే చిన్నవారికి వివాహాలు జరగుతుండడంతో గత కొంతకాలంగా తీవ్ర మానసిక క్షోభకు గురిఅవుతున్నాడు. బుధవారం రాత్రి పంటకు నీళ్ళు పెట్టి వస్తానని పొలం వద్దకు వెళ్ళాడు. తిరిగి ఇంటికి రాకపోయేసరికి ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్ళి చూడగా చెట్టుకు ఉరి వేసుకొని విగతా జీవిగా కనిపించాడు. మృతుని తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు చిన్నశంకరంపేట ఎస్సై నారాయణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.