ములుగు: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ములుగు మండలం అబ్బాపూర్ గ్రామ సమీపంలో పంట పొలాల్లో అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు (ఉచ్చులు) తగిలి ఒక వ్యక్తి , వ్యవసాయ ఎద్దు మృతి చెందంది. స్థానికుల కథనం మేరకు.. అబ్బాపూర్ గ్రామానికి చెందిన సాయినవెయిన యుగేందర్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కొమ్మాల జాతరకు ఎడ్లబండిపై వెళ్లాడు.
నిన్న మొక్కులు చెల్లించుకుని నేడు తెల్లవారుజామున తిరుగు ప్రయాణంలో వస్తుండగా పంట పొలాలలో నుంచి ఎడ్ల బండి బాటలో వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అడవి పందుల వేట కోసం అమర్చి విద్యుత్ వైర్ లకు ఎద్దు తాకడంతో విద్యుదాఘాతానికి లోనై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఎద్దును పట్టుకోగా అతడికి కూడా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు.
వెంటనే అతని భార్య కూడా ఏమైందో అని పట్టుకోగా ఆమెకు కూడా విద్యుత్ షాక్ తగిలి గాయాలయ్యాయి. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ములుగు ఎస్సై ఓంకార్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. వేటగాళ్లు అమర్చిన విద్యుత్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.