మహోబా: నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. కుటుంబ తగాదాలు నాలుగు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. ఇంట్లో కలహాలతో విసిగిపోయిన ఓ మహిళ.. తన ముగ్గురు పిల్లలను హత్య చేసి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. మహోబా జిల్లాలోని కుల్‌పహడ్ ఏరియాలో శనివారం ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కుల్పహడ్కు చెందిన కళ్యాణ్, సోనమ్ ఇద్దరూ భార్యాభర్తలు.
వారికి విశాల్ (11), ఆర్తి (9), అంజలి (7) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, ఈ మధ్య భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దాంతో సోనమ్ పుట్టింటివాళ్లు వచ్చి ఇద్దరికీ నచ్చజెప్పి వెళ్లారు. అయినా శుక్రవారం రాత్రి మళ్లీ గొడవ జరుగడంతో భర్త బయటికి వెళ్లిన సమయం చూసి సోనమ్.. పదునైన ఆయుధంతో తన ముగ్గురు పిల్లల గొంతులు కోసి చంపింది. అనంతరం తాను కూడా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. సోనమ్ భర్త కళ్యాణ్‌ను అదుపులోకి తీసుకుని ఘటనకు సంబంధించి ప్రశ్నిస్తున్నారు.