న్యూఢిల్లీ : యువతి వెంటపడి వేధిస్తున్న వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తనతో సహజీవనం చేసేందుకు నిరాకరించిందనే కోపంతో ఆమెను కత్తితో పొడిచి చంపిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని గౌతం నగర్లో సోమవారం వెలుగుచూసింది. బాధితురాలిని డాలీ బబ్బర్ (23)గా గుర్తించారు. కలిసి జీవిద్దామని నిందితుడు చేసిన ప్రతిపాదనను డాలీ తోసిపుచ్చడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
డాలీ సోమవారం రాత్రి ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ కోసం ఇంటి నుంచి బయలుదేరగా ఓం విహార్‌లోని ఆమె ఇంటికి కొద్దిదూరంలోనే ముగ్గరు వ్యక్తులతో కలిసి నిందితుడు దాడికి పాల్పడ్డాడు. బాధితురాలిని నిందితుడు కత్తిపోట్లకు గురిచేయగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. అప్పటికే రక్తపు మడుగులో యువతి విగతజీవిగా పడిఉంది. బాధితురాలు ఫ్రీలాన్స్ ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తోందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు అంకిత్ గాబా (25) కోసం గాలిస్తున్నారు.