కంటోన్మెంట్, ఆగస్టు 13: నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. ఒకే బైక్‌పై ఐదుగురు ప్రయాణం..నిత్యం ట్రాఫిక్‌తో ఉండే రహదారిపై ఏకంగా ఐదుగురుతో ప్రయాణించాడు. ఇద్దరి కన్నా ఎక్కువ మంది బైక్‌పై ప్రయాణించకూడదన్న నిబంధనను తుంగలో తొక్కి మరీ పల్సర్ వాహనంతో రయ్మనిపించాడు. సరిగ్గా జేబీఎస్ నుంచి పట్టుమని పదినిమిషాలైనా సాగని ప్రయాణంలో ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి వెనుకే వస్తున్న ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడడంతో ఓ మహిళ మృతిచెందిన ఘటన శుక్రవారం ఉదయం కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కార్ఖానా సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ కు చెందిన శీను, రమణమ్మలు తన కుటుంబ సభ్యులతో ద్విచక్రవాహనంపై జేబీఎస్ నుంచి అల్వాల్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో కార్ఖానా లోని అనుభవ్ గార్డెన్స్ సమీపంలో వేములవాడ ఆర్టీసీ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ద్విచక్ర వాహనం వెనుక భాగాన్ని తగలడంతో ఒక్కసారిగా ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. ద్విచక్ర వాహనదారుడు వాహనాన్ని అదుపు చేయకపోవడంతో వెనుక ఉన్న రమణమ్మ కిందపడిపోయింది.
ఆమెపై నుంచి ఆర్టీసి బస్సు వెళ్లడంతో తలకు తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే మరణించింది.
మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న దవాఖానకు తరలించారు. రమణమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.