ముంబై : ఓ వృద్ధురాలు పొద్దున్నే ఇంట్లో పూజలు చేస్తూ.. శ్లోకాలు పఠిస్తోంది. అదే సమయంలో కోడలు కూడా టీవీలో ఓ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం చూస్తూ.. సౌండ్ పెంచింది. కోపంగించుకున్న ఏయ్ కోడలు పిల్ల.. కాస్త సౌండ్ తగ్గించు అని కోరింది. ఇంకేముంది.. అత్తపై కోడలు రుసరుసలాడుతూ.. ఆమె వేళ్లను కొరికేసింది. ఈ ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలోని అంబర్నాథ్లో చోటు చేసుకుంది.
అంబర్నాథ్కు చెందిన వృశాలి కులకర్ణి(60) అనే వృద్ధురాలికి భక్తి ఎక్కువ. దీంతో బుధవారం ఉదయం ఆమె పూజలో నిమగ్నమైంది. శ్లోకాలు పఠిస్తూ.. తన ధ్యాసను దేవుడిపైనే కేంద్రీకరించింది. అదే సమయంలో ఆమె కోడలు విజయ కులకర్ణి(32) టీవీ సౌండ్ పెంచింది. దీంతో అత్త కోపగించుకుంది. పూజ చేస్తున్నాను కదా.. కొంచెం టీవీ సౌండ్ తగ్గించు అని కోడలిని కోరింది. కానీ కోడలు మాత్రం అత్త మాటలు పట్టించుకోలేదు. అత్తపై దాడి చేసి ఆమె చేతి వేళ్లను కోడలు కొరికేసింది. అడ్డుకోబోయిన భర్తను కూడా విజయ వాయించింది. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు శివాజీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.