హుస్నాబాద్/సిద్దిపేట : హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డు విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు ఏసీపీ వాసాల సతీశ్ తెలిపారు. గురువారం హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల అరెస్టును చూపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుస్నాబాద్ పట్టణంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో ఇటీవల నిఘాను పటిష్టం చేశామన్నారు. బుధవారం సాయంత్రం నమ్మదగిన సమాచారంతో సబ్‌స్టేషన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన పిల్లి శ్రీనివాస్, పిల్లి కల్యాణ్ అనే యువకులు టీఎస్ 08టీక్యూ 5775అనే పల్పర్ బండిపై గంజాయి ప్యాకెట్ తీసుకెళ్తూ ఎస్ఐ శ్రీధర్‌కు పట్టుబడ్డారని చెప్పారు.
వీరి వద్ద సుమారు 280 గ్రాముల ఎండు గంజాయి ఉంచిన కవర్ దొరికిందన్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వివరించారు. ఎవరైనా మత్తు పదార్థాలు వాడుతున్నట్లు గానీ, విక్రయిస్తున్నట్లు గానీ, రవాణా చేస్తున్నట్లు గానీ తెలిస్తే వెంటనే పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో సీఐ రఘుపతిరెడ్డి, ఎస్ఐ శ్రీధర్ పాల్గొన్నారు