ఖమ్మం :ట్రాఫిక్ నియమ నిబంధనలు అతిక్రమించి రోడ్లపై వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్ సిఐ అంజలి అన్నారు. ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి మద్యం మత్తులో రోడ్లపై వాహనాలు నడుపుతున్న వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు ట్రాఫిక్ కౌన్సిలింగ్ సెంటర్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యం తాగి వాహనం నడపడం వల్ల కలిగే దుష్ఫలితాలను తెలియజేశారు. ప్రతిరోజు నగరంతో పాటు బైపాస్ రోడ్డుపైన నిబంధనలు పాటించకుండా వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి నిబంధనలు పాటించేలా వారికి అవగాహన కల్పిస్తున్నామని ఆమె చెప్పారు. వీటితో పాటుగా ఈ హైవేపైనే రోడ్డు పక్కన ఉన్న జంక్షన్లను సులభంగా గుర్తించడానికి బ్లింకర్స్ ను ఏర్పాటు చేశారు.
ఆర్టీసీ బస్సులు, ఆటోలకు ప్రత్యేకంగా స్టికర్లను అతికించి ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు కచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలని, ఆటోలో లౌడ్ స్పీకర్స్ ను నిషేధించాలని, తప్పనసరిగ్గా ఇన్సురెన్స్ సదుపాయం కలిగిఉండాలని, వేగంగా ప్రయణించడం వలన కలిగే నష్టాలపై కౌన్సెలింగ్ నిర్వహించారు. పాటించాల్సిన నిబంధనలు, పాదచారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రతి పాఠశాల, కళాశాలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నామని ఆమె తెలిపారు. రోడ్డుపై వాహనాలను నిలుపొద్దని ప్రచారం చేస్తూ రాంగ్ పారింగ్ చేసిన వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి నిబంధనల ప్రకారం ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్నామని సీఐ అంజలి వివరించారు.