Hyderabad | వెంగళరావునగర్, మే 2 : భాగ్యనగరంలో కామాంధులు బరితెగించారు. భర్త కళ్లెదుటే భార్యను వేధించారు. ” నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు” అంటూ దారికి అడ్డంగా నిలబడి బీరు బాటిళ్లతో బెదిరించారు. భర్త, మరిది, ఆడపడుచుతో కలిసి పబ్‌కెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా వివాహితను వెంబడించారు. వారి నుంచి తప్పించుకుని డయల్ 100కి ఫోన్ చేయడంతో ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు ముగ్గురు ఆకతాయిలను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం ఏపీలోని ఒంగోలుకు చెందిన యువతి (29) తన భర్త, మరిది, ఆడపడుచుతో కలిసి హైదరాబాద్ రహ్మత్ నగర్‌లోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. గురువారం సాయంత్రం ఆ యువతి తన భర్త, మరిది, ఆడపడుచు, బంధువు స్నేహితుడితో కలిసి బేగంపేటలోని క్లబ్ – 8 పబ్ కు వెళ్లారు. రాత్రి 11.40 గంటల సమయంలో పబ్ నుంచి ఇంటికి బయల్దేరారు. ఆ సమయంలో ఆమెను చూసిన ముగ్గురు యువకులు అడ్డగించారు. అప్పుడు తానుతన భర్తతో కలిసి వచ్చానని చెప్పింది. దీనికి నన్నే నీ భర్త అనుకో.. ఫోన్ నెంబర్ ఇవ్వు అంటూ వేధించారు. చేతుల్లో బీర్ బాటిళ్లు పట్టుకుని బెదిరింపులకు దిగారు. బేగంపేట నుంచి రహ్మత్ నగర్‌కు వచ్చే దాకా ఆ కామాంధులు వెకిలి చేష్టలతో వెంబడించి వేధింపులకు గురిచేశారు.
వివాహితను ఇంట్లో దిగబెట్టిన తర్వాత తన స్నేహితుడిని డ్రాప్ చేసేందుకు భర్త మాదాపూర్ వెళ్తుండగా, ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర వారిని అడ్డగించి ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారు. వారు ప్రయాణించే బైక్‌తో పాటు ఫోన్లను బలవంతంగా లాక్కున్నారు. దీంతో వారు డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వివాహితను వేధించిన వారిని పంజాగుట్టకు చెందిన డి.సంపత్ (28), సందీప్ (28), కూకట్ పల్లికి చెందిన ఉమేష్ (28)లుగా గుర్తించారు. వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.