అమరావతి : ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని హాలహర్వి మండలం చింతకుంట వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన గుంతలో ద్విచక్రవాహనం పడి ముగ్గురు మృతి చెందారు. వంతెన వద్ద ఎలాంటి సూచిక బోర్టులు లేకపోవడంతో అతివేగంగా వచ్చిన బైక్ గుంతలో పడి ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు కర్ణాటకలోని బళ్లారి జిల్లా శిరుగుప్ప సమీపంలోని టెక్కలకోట గ్రామానికి చెందిన బోయ గాది, బోయ చంద్రశేఖర్, కాడ సిద్ధగా గుర్తించారు .
వంతెనను నిర్మిస్తున్న కాంట్రాక్టర్ సూచిక బోర్టులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను సమీప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.