కొత్తగూడెం : అనుమానాస్పద స్థితిలో మెకానిక్ మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి కొత్తగూడెం పట్టణంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. కొత్తగూడెం పట్టణంలోని హనుమాన్ బస్తీ ప్రాంతానికి చెందిన గౌస్ పాషా(36) మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి కూలీలైన్ స్కూల్ సమీపంలో స్థానికులకు గౌస్ పాషా విగతజీవిగా కనిపించడంతో త్రీ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గౌస్ మృతదేహాన్ని జిల్లా వైద్యశాల మార్చూరీకి తరలించి, అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి ముఖంపై గాయాలను బట్టి ఇది హత్యా..? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. త్రీ టౌన్ పోలీసులు మాత్రం ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ వేణుచందర్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.