మహేశ్వరం : తాగుడుకు బానిసై కట్టుకున్న భార్యనే హతమార్చిన సంఘటన మహేశ్వరం పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. మహేశ్వరం సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం..కందుకూరు మండలం చిప్పల పల్లికి చెందిన అలువాల మంగమ్మ , అలువాల నర్సింహ్మ భార్యభర్తలు.
వీరు గత 5 ఏండ్ల క్రితం కందుకూరు నుండి అమ్మగారి ఊరైన మాణిక్యమ్మ గూడకు వచ్చి కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. నర్సింహ్మా ప్రతి రోజు మద్యం సేవించి భార్యతో గొడవపడుతుండేవాడు. రోజు మాదిరిగానే మద్యం సేవించి భార్యతో గొడవపడిన నర్సింహ్మ రాత్రి 2 గంటల సమయంలో కరెంటు వైరుతో మంగమ్మ మేడకు ఉరివేసి హత్యచేసి చంపాడు.
ఉదయం చుట్టుపక్కల వారికి తన భార్య చనిపోయిందని చెప్పాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.