New Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన జరిగింది. 11వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని కొందరు స్థానిక మైనర్లు కొట్టి చంపారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో జరిగింది. మృతుడిని ఢిల్లీలోని త్రిలోక పురి, ఇంద్రా క్యాంప్ ప్రాంతానికి చెందిన మోహిత్ గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోహిత్ కు కొంత కాలం నుంచి అదే ప్రాంతానికి చెందిన మరో మైనర్ యువకుడితో గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో సోమవారం సాయంత్రం మోహిత్ తన స్నేహితులతో ఉండగా, ప్రత్యర్థి యువకుడికి, అతడి స్నేహితులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇది వారి మధ్య ఘర్షణకు దారితీసింది. నిందితుడు, అతడి స్నేహితులు మోహిత్ ను చుట్టుముట్టి, దాడి చేశారు. దారుణంగా కొట్టారు. వెంటనే మోహిత్ కిందపడిపోయాడు. అయినప్పటికీ అతడిపై దాడి చేస్తూనే ఉన్నారు. స్థానికంగా కొందరు అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వారిపై కూడా నిందితులు దాడి చేశారు. ఈ ఘటనలో మోహిత్ అక్కడే స్పృహ తప్పిపడిపోయాడు.
వెంటనే మోహిత్ ను అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎల్బీఎస్ ఆస్పత్రికి తరలించగా, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గురు తేగ్ బహదూర్ హాస్పిటల్కు తరలించారు. అయితే, తీవ్ర గాయాలైన మోహిత్ అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మరణించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులైన ఆరుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.