ఇంటి బయట ఆడుకుంటున్నదా నాలుగేళ్ల చిన్నారి. ఇంతలో పక్క నుంచి గుర్రుగా శబ్దం రావడంతో తిరిగి చూసింది. నాలుగు వీధికుక్కలు తన వైపు రావడం చూసి ఇంటికి పరుగు తీసింది. కానీ ఆ కుక్కల వేగం ముందు.. ఆ చిన్ని పాదాల వేగం ఎంత? కొద్ది దూరంలోనే ఆ చిన్నారిని ఆ వీధికుక్కలు చుట్టుముట్టాయి.
ఆ వెంటనే ఒక కుక్క.. ఆ చిన్నారిపై కుడివైపు నుంచి దాడి చేసి కిందపడేసింది. భయంతో పెద్దగా ఆరిచిన ఆ పసిపాప పైకి లేవడానికి ప్రయత్నించింది. కానీ మిగతా కుక్కలన్నీ ఒకేసారి మీదపడటంతో నిస్సహాయురాలైపోయింది. పాప అరుపులు అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి చెవుల పడ్డాయి. ముందుకొచ్చి చూసిన అతను ఈ భయానక దృశ్యం చూసి నిశ్చేష్టుడైపోయాడు.
వెంటనే రోడ్డు పక్కన ఉన్న రాళ్లు తీసుకొని పెద్దగా అరుస్తూ ఆ వీధికుక్కలపైకి విసిరాడు. అతను దాడి చేయడంతో పాపను వదిలేసి, ఆ శునకాలు పారిపోయాయి. ఈ భయానక దృశ్యం ఆ పక్కనే ఉన్న ఒక సీసీ కెమెరాలో రికార్డయింది. దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో వెలుగు చూసింది.
ఇటీవలి కాలంలో భోపాల్లో ఇలాంటి వీధికుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. అధికారులు మాత్రం పరిస్థితి నియంత్రణలోనే ఉందని, కరోనా సెకండ్ వేవ్ సమయంలో రెండు నెలలు మాత్రమే స్టెరిలైజేషన్ ఆపామని అంటున్నారు.
ప్రతిరోజూ 40-50 వీధిక్కులకు స్టెరిలైజేషన్ చేస్తున్నామని, ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని బుకాయిస్తున్నారు. కాగా, నాలుగేళ్ల చిన్నారిపై ఘటనపై మధ్యప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. దీనిపై వారంలోగా వివరణ ఇవ్వాలని మున్సిపల్ అధికారులను ఆదేశించింది.
Horrific: #Stray dogs in Baghsewania locality of Bhopal attacked a four-year-old girl on Saturday evening. The girl has sustained serious injuries and is undergoing treatment at a hospital. pic.twitter.com/soQREEJ4u4
— Free Press Journal (@fpjindia) January 2, 2022