అహ్మదాబాద్ : గత కొద్దినెలలుగా దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) చెలరేగుతున్నారు. రోజుకో తరహా స్కామ్‌తో రెచ్చిపోతూ అమాయకుల నుంచి ఆన్లైన్ వేదికగా రూ. కోట్లు లూటీ చేస్తున్నారు. లేటెస్ట్గా అహ్మదాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయమైన మహిళ ఏకంగా కోటి రూపాయలకు ముంచేసింది. మహిళ మాయలో పడిన టెకీ ఆమె సలహాపై క్రిప్టో కరెన్సీలో రూ. కోటి ఇన్వెస్ట్ చేసి మొత్తం పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గాంధీనగర్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే కుల్దీప్ పటేల్‌కు ఈ ఏడాది జూన్‌లో మ్యాట్రిమోనియల్ సైట్లో అదితి అనే మహిళ పరిచయమైంది.
తాను బ్రిటన్‌లో ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ వ్యాపారం చేస్తానని నమ్మబలికిన అదితి మెరుగైన రిటన్స్ వచ్చేందుకు బానోకాయిన్లో ఇన్వెస్ట్ చేయాలని పటేల్‌ను మభ్యపెట్టింది. లాభాలు వస్తాయనే ఆశతో పటేల్ బానోకాయిన్ వెబ్సైట్లో రిజిస్టరై అందులో ఇన్వెస్ట్ చేశాడు. తొలి లక్ష రూపాయల పెట్టుబడిపై తనకు 78 అమెరికన్ డాలర్ టెధర్ లాభం వచ్చినట్టు తన క్రిప్టో ఖాతా చూపడంతో స్కామర్లను పటేల్ నమ్మడం ప్రారంభించాడు.
ఆపై 18 లావాదేవీల్లో ఏకంగా రూ. 1.34 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు. జులై 20 నుంచి ఆగస్ట్ 31 మధ్య ఈ లావాదేవీలను చేపట్టాడు. ఆపై సెప్టెంబర్ 3న తన ఖాతా నుంచి రూ. 2.59 లక్షలు విత్‌డ్రా చేసేందుకు పటేల్ ప్రయత్నించగా అకౌంట్ ఫ్రీజ్ అయిందని చెప్పడంతో కంగుతిన్నాడు. దీంతో కస్టమర్ కేర్ ప్రతినిధిని పటేల్ సంప్రదించగా తన అకౌంట్‌ను తిరిగి తెరిచేందుకు మరో రూ. 35 లక్షలు ఇన్వెస్ట్ చేయాలని కోరాడు. ఆపై అదితితో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఎంతకూ ఆమె స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన పటేల్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Rain Alert | దేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్ ప్రకటించిన ఐఎండీ