సైదాబాద్ : మూడు అంతస్తుల భవనంపై పనిచేస్తున్న మేస్త్రీ ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డ సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం…మహబుబ్నగర్ జిల్లా మక్తల్ పంచలింగాల గ్రామానికి చెందిన పి. వెంకటేశ్వర్ (50), భార్య పద్మ బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి సైదాబాద్ పూసలబస్తీలో నివాసముంటున్నాడు. ఇద్దరూ ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నారు.
కాగా సైదాబాద్ మూడు గుళ్ల ప్రాంతంలో మూడంతస్తుల భవన నిర్మాణంలో వెంకటేశ్వర్ మెస్త్రీగా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం పనులు చేస్తున్న క్రమంలో పై నుంచి కిందపడటంతో తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పద్మ కిందపడిన భర్తను చూసి గట్టిగా అరవడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి 108 అంబులెన్స్ వాహనం రావటంతో గాయపడ్డ ఆతన్ని చికిత్స నిమిత్తం ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
కాగా నిర్మాణంలో ఉన్న భవనం అక్రమంగా నిర్మిస్తున్నారని, ఆ ఇంటి నిర్మాణంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా నిబంధనలకు విరుద్దంగా పనులు కొనసాగిస్తుండడం వల్లే మేస్త్రీ వెంకటేశ్వర్ భవనంపై నుంచి కింద పడ్డాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధితుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు